English | Telugu

'మై విలేజ్ షో' అనిల్ వెరైటీ వెడ్డింగ్ కార్డ్‌!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మే నెలలో కొన్ని లక్షల సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. దీంతో కొందరు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వివాహాలను జరుపుకునేందుకు రెడీ అవుతుండగా.. మరికొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అయితే 'మై విలేజ్ షో" అనిల్ తాజాగా కొత్త పద్దతిని ఎన్నుకున్నారు. తన వెడ్డింగ్ కార్డులోనే అన్ని విషయాలను వివరించారు. మే 1న ఆయ‌న పెళ్లి ఆమ‌నితో జ‌రుగుతోంది. ఇన్‌స్టా లైవ్‌లో శ‌నివారం రాత్రి 8 గంట‌ల నుంచి ఈ పెళ్లిని చూసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా అయితే 'శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు' అంటూ పెళ్లి కార్డు మొదలుపెడతారు. కానీ అనీల్ మాత్రం తన పెళ్లి కార్డుని "శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్" అంటూ కరోనా నిబంధనల గురించి రాసుకొచ్చారు. ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చదువు సంధ్యల విషయం చెప్పాల్సిన దగ్గర.. "కరోనా నెగెటివ్" అంటూ రాశారు.

ఆ తరువాత.. ''మరువకుండా మీ ఫోన్‌ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్‌ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు. విందు.. లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి.. దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపండి'' అంటూ ఫన్నీగా పెళ్లి కార్డుని డిజైన్ చేశారు. తన పెళ్లికి వచ్చే కట్నకానుకలను కరోనాతో బాధ పడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని పెళ్లి కార్డులో ముద్రించారు. 'మై విలేజ్‌ షో'తో పాపులర్‌ అయిన అనిల్‌ కరోనా కాలంలో అందరూ ఒకేచోట ఉండడం ప్రమాదకరమని చెప్పే విధంగా తన పెళ్లి కార్డుని తయారు చేశారు.