English | Telugu
సుధీర్ జంప్.. రష్మీకి న్యాయం కావాలట!
Updated : Jun 5, 2022
`ఎక్స్‌ట్రా జబర్దస్త్` యాంకర్ రష్మీ రోడ్డెక్కింది. తనకు న్యాయం కావాలంటూ టెంట్ వేసుకుని మరీ ధర్నాకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల `జబర్దస్త్`,`ఎక్స్‌ట్రా జబర్దస్త్` కామెడీ షోలకు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు న్యాయం కావాలంటూ రష్మీ రోడ్డెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. `జబర్దస్త్`, `ఎక్స్‌ట్రా జబర్దస్త్` షోలలో గత కొన్నేళ్లుగా సుడిగాలి సుధీర్ తన టీమ్ తో కలిసి నవ్వులు పూయించాడు. ఇదే సమయంలో యాంకర్ రష్మీతో సుధీర్ చేసే అల్లరి, హంగామా ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచి టాప్ రేటింగ్ ని అందించింది.
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ల లవ్ ట్రాక్, ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ ఈ షోకి ప్రధాన హైలైట్ గా నిలిచి షోని మరింత పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇద్దరు ప్రేమలో వున్నారని, డేటింగ్ నడుస్తోందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ `ఎక్స్‌ట్రా జబర్దస్త్` వేదికపై రోజా పలు దఫాలుగా వీరికి ఉత్తుత్తి పెళ్లి చేసి తన ముచ్చట తీర్చుకోవడంతో నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఇటీవల ఓ షోలో సుధీర్ కు ఏ దిష్టీ తగలకూడదంటూ రష్మీ దిష్టి తీయడం వీరి మధ్య వున్న అనుబంధాన్ని మరింత బయటపెట్టింది.
అలా రష్మీతో బాగా కనెక్ట్ అయిపోయిన సుడిగాలి సుధీర్ ఇటీవల `జబర్దస్త్` `ఎక్స్‌ట్రా జబర్దస్త్` కి గుడ్ బై చెప్పేశాడు. సినిమాల్లో అవకాశాలు రావడం, అంతే కాకుండా `స్టార్ మా` లో `సూపర్ సింగర్ జూనియర్` లో అనసూయతో కలిసి యాంకర్ గా వ్యవహరించే కాంట్రాక్ట్ దక్కడంతో సుధీర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశాడు. అంతే కాకుండా గత మూడు నాలుగు వారాలుగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` లోనూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ తనకు న్యాయం కావాలంటూ కొంత మందిని వెంటేసుకుని టెంటేసుకుని ధర్నాకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.
జూన్ 10న ఈటీవిలో ప్రసారం కానున్న `ఎక్స్‌ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆటో రాంప్రసాద్ పై రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్, నూకరాజు లు ప్రత్యేకంగా చేసిన స్కిట్ ఎమోషనల్ గా సాగింది. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన ఆటో రాంప్రసాద్ అంతరంగాన్ని, అతను పడుతున్న బాధని వర్ణిస్తూ రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్, నూకరాజు లు చేసిన స్కిట్ అక్కడున్న వారిని భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఇదే షోలో రష్మీ గౌతమ్ నాకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కడం, టెంట్ వేసుకుని కొంత మందిని వెంటేసుకుని ధర్నాకు దిగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ రష్మీ గౌతమ్ ధర్నా ఎందుకు చేసింది? ఎవరి కోసం చేసింది? ఏమా కథ? అన్నది తెలియాలంటే జూన్ 10న ప్రసారం కానున్న ఈ షో చూడాల్సిందే.