English | Telugu

బుల్లితెర‌పై హీరో త‌ల్లిగా రాశి!

వెండితెర‌పై క‌థానాయిక‌లుగా ఆక‌ట్టుకున్న వారితో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా వ‌ర‌కు బుల్లితెర‌ని ఆశ్ర‌యిస్తున్నారు. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒక‌నాటి హీరోయిన్ రాశి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజా ర‌వీంద్ర చేరుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మా కోసం 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' అనే పేరుతో రూపొందిన డైలీ సీరియ‌ల్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఇందులో 'సిరిసిరి మువ్వ‌లు' ఫేమ్ వంశీ ఆలూర్‌, 'మౌన‌రాగం' ఫేమ్ అమ్ములు పాత్ర ధారి ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారి వంశీ ఆలూరుకి రాశీ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, రాజా ర‌వీంద్ర మ‌రో కీల‌క పాత్ర‌ధారి ప్రియాంక జైన్‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. రెండు క‌ల‌ల మ‌ధ్య రెండు జీవితాలు ఒకే గూటికి చేర‌బోతున్నాయా అంటూ రిలీజ్ చేసిన ఈ సీరియ‌ల్ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

"జాన‌కి ఎంత చ‌దివినా అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడినే తీసుకొస్తాన‌"ని తండ్రి పాత్ర‌లో రాజా ర‌వీంద్ర చెబుతున్న డైలాగ్‌ల‌తో పాటు "మంచిది తెలివైంది అయితే ఫ‌ర‌వాలేదు. కానీ మావాడిక‌న్నా ఎక్కువ చ‌దివేసి పొగ‌రుగా వుంటే మాత్రం క‌ష్టం.. నా కోడ‌లు ఏడో ఎనిమిదో చ‌దివితే చాలు".. అని రాశి చెబుతున్న తీరు భిన్న మ‌న‌స్థ‌త్వాలు.. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' సీరియ‌ల్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.