English | Telugu
ఆర్యవర్ధన్ ని అడ్డంగా బుక్ చేసిన రాగసుధ
Updated : Jun 2, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొంత కాలంగా జీ తెలుగులో విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ ప్రతీ రోజు చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ అలరిస్తోంది. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` దీనికి ఆధారం. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె, జయలలిత, జ్యోతిరెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, అనూషా సంతోష్, రామ్ జగన్, సందీప్ తదితరులు నటించారు.
అర్యవర్ధన్ ని చావు దెబ్బ కొట్టాలని అతని ఆఫీసులో అను సాయంతో సుధా రాజ్ పుత్ గా చేరిన రాగసుధ అనుకున్నట్టుగానే తన ప్లాన్ ని అంచెలంచెలుగా అమలు చేస్తూ వుంటుంది. ప్రతీ విషయంలో అనుని అడ్డుపెట్టుకుని తప్పించుకుంటూ తన టార్గెట్ వైపు అడుగులు వేస్తూ వెళుతున్న రాగసుధ ఈ రోజు ఎపిసోడ్ లో ఆర్య వర్ధన్ కు ఊహించని షాకిస్తుంది. ఆర్య వర్ధన్ వాయిస్ ని వాడుకుని తానే రాజనందినిని హత్య చేశాడని క్రియేట్ చేసిన న్యూస్ ఛానల్ దాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద టెలికాస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది.
విషయం తెలిసి ఆ ప్రయత్నాన్ని జెండే తో కలిసి ఆపేస్తాడు ఆర్య. అయితే ఆ సీడీని సదరు న్యూస్ ఛానల్ వారి నుంచి రాగసుధ గ్యాంగ్ తీసుకెళ్లిపోవడంతో ఆర్యలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. సుధారాజ్ పుతే రాగసుధ అని తెలుసుకున్న ఆర్య వర్ధన్.. జెండేతో కలిసి తన ప్రయత్నాలని ఆపాలనుకుంటాడు రానీ ఈ లోగానే అనుని తీసుకుని ఆర్య వర్ధన్ వాయిస్ వున్న పెన్ డ్రైవ్ తో పోలీస్టేషన్ కి వెళ్లిన రాగసుధ అనుచేతే ఆర్యపై తెలివిగా కేసు పెట్టిస్తుంది. అదే సమయానికి ఆర్య వర్ధన్ ఆడియో వున్న వీడియోని వాట్స ప్ గ్రూపుల ద్వారా అందరికి చేరేలా చేస్తుంది.
ఇదే సమయంలో ఆర్య వర్ధన్, జెండే ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తారు. అది పట్టించుకోకుండా స్టాఫ్ అంతా మొబైల్స్ ఆన్ చేసి ఆర్యవర్ధన్ వాయిస్ వున్న వీడియోని చూస్తూ షాక్ లో వుంటారు. ఏం జరుగుతోందని అడిగిన జెండే విషయం తెలిసి షాక్ కు గురవుతాడు. అదే విషయం ఆర్యకు చెప్పడానికి వెళితే అప్పటికే ఆర్య మొబైల్ కు ఆ వీడియో చేరుతుంది. ఈ షాక్ లో వుండగానే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది? ఆర్య వర్ధన్ అరెస్ట్ అయ్యాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.