English | Telugu

కౌశ‌ల్ భార్య‌కు కొవిడ్ నెగ‌టివ్‌! ఇండియాకు తిరిగొచ్చేసింది!!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు కౌశల్. అప్పటివరకు సీరియల్స్ లో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కౌశల్ కి బిగ్ బాస్ షో ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. షో నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచాడు కౌశల్. అదే సమయంలో కౌశల్ భార్యపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ స్వయంగా ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. ఉద్యోగ రీత్యా యూకేలో ఉంటున్నానని.. ఆ సమయంలో కోవిడ్ బారిన పడినట్లు నీలిమ వెల్లడించింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తనకు సరైన వైద్యం కూడా చేయడం లేదంటూ వాపోయింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకున్నారు.

తాజాగా నీలిమ కరోనా నుండి బయటపడింది. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగెటివ్ రావడంతో వెంటనే ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ నుండి తనకు సర్టిఫికేట్ రావడంతో నీలిమ ఇండియాకు చేరుకుందని కౌశల్ తెలిపాడు. తన ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ కృతజ్ఞతలు చెప్పింది. చాలా రోజుల త‌ర్వాత త‌న పిల్ల‌ల‌ను క‌లుసుకున్నానంటూ వాళ్ల‌తో క‌లిసి ఆడుతున్న వీడియోల‌ను షేర్ చేసింది.