English | Telugu

మేం కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం!!

బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై కూడా అలరిస్తూ వ‌స్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రేమ, పెళ్లి వంటి విషయాలను ఎప్పటికప్పుడు మీడియాతో చెబుతూనే ఉంటుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తన లవ్ స్టోరీతో సినిమా చేయొచ్చని చాలాసార్లు చెప్పింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి తరచూ మాట్లాడుతూనే ఉంటుంది. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

రీసెంట్ గా ఈ జంట పదకొండో పెళ్లిరోజు సందర్భంగా తమ ప్రేమకు ఇరవై ఏళ్లు నిండాయని చెబుతూ అనసూయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో తన భర్తతో ఇంట్లో ఎలా ఉంటాననే విషయాలు చెప్పుకొచ్చింది. ఎన్‌సీసీ క్యాంపులో తమ ప్రేమ మొదలైందని.. ఆయన ప్రపోజల్ బాగా నచ్చిందని.. ప్రేమ గురించి మాట్లాడకుండా నేరుగా పెళ్లి విషయాన్నే ప్రస్తావించారని అనసూయ చెబుతుంటుంది.

అయితే ఇప్పుడు తన భర్తపై కొన్ని కంప్లైంట్స్ చేస్తోంది. ఇద్దరం ఒకరినొకరం బాగా కొట్టుకుంటామని.. గొడవలు పడుతుంటామని.. ఒకరి మీద ఒకరికి చిరాకు వచ్చేలా చేస్తుంటామని.. ఒక్కోసారి ఇద్దరి అభిప్రాయాలు అసలు క‌ల‌వ‌వ‌ని.. పిచ్చి పనులు చేస్తుంటామని చెప్పింది. ఇక రేపు అనేది లేదనేట్లుగా కొట్టుకుంటామని.. మళ్లీ వెంటనే ఒకరి చేతిని ఒకరం పట్టుకొని అన్నీ మర్చిపోతామని.. అదే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చింది.