English | Telugu
'కార్తీక దీపం'లో కీలక మలుపు... అంజిని తీసుకొస్తున్న వంటలక్క!
Updated : Jul 28, 2021
ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ తన మెడలో తాళిబొట్టు కట్టాల్సిందేనని, లేదంటే కార్తీక్ కుటుంబ పరువును బజారుకు ఈడుస్తానని మోనిత మంగమ్మ శపథం చేస్తుంది. జూలై 28 తేదీ, 1103 ఎపిసోడ్ లో మోనిత వీరంగం సృష్టించింది. కార్తీక్ అంటే తనకు పిచ్చి అని అతడితో, అతడి భార్య దీపతో చెబుతుంది. 'పెళ్లి అయినవాడిని ప్రేమించడమే తప్పు' అని కార్తీక్ చెప్పినా వినిపించుకోదు.
'నువ్వు ప్రేమించావని నేను ప్రేమిస్తే అది స్వార్థం. కానీ, ప్రేమించకపోయినా పర్వాలేదని ప్రేమిస్తే త్యాగం. నేను త్యాగమూర్తిని. నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టడం అన్యాయం. నువ్వు ద్వేషించవని నీ భార్య నీకు పదేళ్లు దూరంగా ఉంది. కానీ, నేను పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా. మరో మగాడిని దగ్గరకు రానివ్వడం లేదు' అని మోనిత ఆగ్రహావేశాలకు లోనవుతూ ఏడుస్తుంది. 25న కార్తీక్ తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబాన్ని బజారుకు ఈడుస్తానని బెదిరిస్తుంది. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
కొత్త ప్రోమోలో హైలైట్స్ ఏంటంటే... మోనిత ఇంటికి దీప వెళుతుంది. సరిగ్గా అప్పుడే మోనితకు ఏసీపీ రోషిణి నుండి ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి 'బయలుదేరేవా?' అని ప్రశ్న. 'వస్తున్నా మేడమ్' అని మోనిత సమాధానం. 'నీకోసం కూడా వెయిట్ చేయాలా?' అని రోషిణి అసహనం. లోపల ఆందోళన ఉన్నప్పటికీ, పైకి కనిపించనివ్వకుండా 'నేను రోషిణి మేడమ్ దగ్గరకు వెళ్తున్నాను. వచ్చాక నీ పని చెబుతా' అని వంటలక్క అలియాస్ దీపకు మోనిత వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతుంది. 'వెళ్తున్నాను కాదు... వెళ్తున్నాం. మనిద్దరం వెళ్తున్నాం. అక్కడ అంజి ఉన్నాడో, దుర్గ ఉందో? నీ పాత నేరాల గురించి కొత్తగా ఏం కథనాలు చెబుతున్నారో' అంటుంది దీప.
కొన్ని రోజులుగా అంజి ప్రస్తావనను దీప తీసుకొస్తూ ఉంది. మరి, అతడు జూలై 29 ఎపిసోడ్ లో ఎంటర్ అవుతాడో, సస్పెన్స్ లో పెడుతూ మరోరోజు ఆలస్యం చేస్తారో చూడాలి. కాలేజీ రోజుల్లో కార్తీక్ ను దక్కించుకోవడం కోసం అతడు ప్రేమించిన అమ్మాయిని హత్య చేయడానికి అంజికి మోనిత సుపారీ ఇస్తుంది. మంచివాడిగా మారిన అంజి, ఆ విషయం కార్తీక్ కు చెబుతాడు. అదీ సంగతి. ఇప్పుడు ఆ నేరాలు బయటకు వస్తాయేమో చూడాలి. అంజి రాకతో సీరియల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?