Read more!

English | Telugu

Karthika Deepam2 : గుండెల్ని పిండేసిన శౌర్య.. ఆ నిజాన్ని కార్తీక్ చెప్పగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో.. దీప, శౌర్యలతో సుమిత్ర, జ్యోత్స్నలు మాట్లాడుతూ ఉండగా కార్తీక్ వస్తాడు. కారు సౌండ్ రాగానే బావొచ్చాడంటూ‌ జ్యోత్స్న వెళ్తుంది. దీంతో శౌర్య.. వస్తే లోపలికి రాడా.. పరుగెత్తుకుంటూ వెళ్లిపోవాలా అని అంటుంది. ఏయ్.. నోర్ముయ్ అని శౌర్యని దీప కోప్పడుతుంది. చిన్నది సరదాగా అడిగితే కోప్పడతావేంటని దీపని సుమిత్ర అంటుంది. ఇక కార్తీక్‌కి ఎదురెళ్లిన జోత్స్న.. అమ్మని కాపాడిన ఆమె ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది బావా.. తను చాలా మంచింది బావా.. ఆ అక్కని చూశావంటే ఇలాంటి మంచి మనిషిని కలవడానికి ఇన్నేళ్లు పట్టిందా అని నువ్వే అంటావని కార్తిక్ తో జ్యోత్స్న అంటుంది. తను అంతమంచి మనిషి కాబట్టే ప్రమాదానికి తాను ఎదురెళ్లి అమ్మని కాపాడింది. ముందు నేను తనకి థాంక్స్ చెప్పాలి పదా అని ఇంట్లోకి కార్తిక్ వెళ్తాడు.

అదిగో మా అల్లుడు వచ్చేశాడని ఒళ్లో ఉన్న శౌర్యకి సుమిత్ర కార్తీక్‌ని  చూపిస్తుంది. అయితే కార్తీక్‌ని చూసిన శౌర్య షాక్ అవుతుంది. " అమ్మకి సైకిల్ ఇచ్చింది, తనకి యాక్సిడెంట్ చేయబోయింది, అమ్మ గొడవపడుతున్నదీ, ఇతనితోనే కదా " అని శౌర్య ఆశ్చర్యంగా చూస్తుంది. శౌర్యని చూసి గుర్తుపట్టి దీపను వెనుక నుంచి చూస్తాడు కార్తిక్. ఈ అక్కే అమ్మని కాపాడింది బావ అని కార్తిక్ కి దీపని పరిచయం చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ వెనుక నుంచే నమస్తే అండీ అంటూ దండం పెడతాడు. దాంతో వెనక్కి తిరిగిన దీపకి ఊహించని షాక్ తగులుతుంది. ఎదురుగా కార్తీక్‌ని చూసేసరికి ఒక్కసారిగా ఆగిపోతుంది. దండం పెట్టబోయి చేతుల్ని కిందికి దింపేసిన దీప.. కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది. వెంటనే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోతుంది. కార్తీక్ కారు ఎవర్నో గుద్దేయడం.. అతను చనిపోవడం.. ఆ తప్పు నేను చేయలేదు దీపా అని కార్తీక్ చెప్పడం.. ఇదంతా గుర్తుకుచేసుకుంటుంది దీప. కళ్లతోనే కార్తీక్‌ని మర్డర్ చేసేట్టు చూస్తుంది. కాసేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది. నేను అసహ్యించుకునే ఆ మనిషి ఇంటికే నేను రావడమేంటి? ప్రపంచం మరీ ఇంత చిన్నదా? అతను నా కంటికి కనిపించకూడదంటే.. నేను ఎక్కడికి వెళ్లాలని దీప ఆలోచిస్తుంటుంది. ఇంతలో శౌర్య వచ్చి.. ఈ అంకుల్ జాతరలో కనిపించాడు.. రోడ్డుపై కనిపించాడు.. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా కనిపించాడు.. ఈ ఇల్లు ఆ సారూ ఇల్లేనా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ సారు వస్తున్నారు కదా.. ఇప్పటికి మూడు సార్లు కనిపించారు. మరి నాన్న ఎందుకు కనిపించలేదమ్మా.. నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే నాన్న చూడ్డానికి రాలేదేంటి? నాన్న ఎలా ఉంటారో నీక్కూడా తెలియదా? అని దీపతో శౌర్య అంటుంది. కూతురి మాటలకు దీప ఏడుస్తుంది. మోసం అనే పదానికి అర్ధం తెలియని వయసే నీది.. నీ తల్లిని నీ తండ్రే మోసం చేశాడని ఎలా చెప్పాలని శౌర్యని పట్టుకుని దీప ఏడ్చేస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావ్.. దెబ్బ నొప్పిగా ఉందా? ఏడ్వద్దమ్మా.. నొప్పి తగ్గిపోతుందిలే అని శౌర్య చెప్తుంది. మరోవైపు కార్తీక్ అయితే దీప గురించే ఆలోచిస్తాడు. ఇప్పటికే జరిగిన దానికి సగం చచ్చిబతుకున్నా.. ఇప్పుడు నువ్వు చూసే చూపు ఎలా ఉందో తెలుసా దీప.. నువ్వు మా నాన్నని చంపేశావ్ కానీ.. నేను మీ అత్తని కాపాడాను.. మనిషి అంటే ఇలా కదరా ఉండాలి అనేట్టు చేశావ్ అని కార్తిక్ అనుకుంటాడు.

నాపై నీ ద్వేషం పోవాలంటే.. అసలు ఆరోజు ఏం జరిగిందో నీకు తెలియాలి? నిన్ను ఇంటికి తీసుకుని వచ్చి ఆ దేవుడే నాకు అవకాశం ఇచ్చాడనిపిస్తుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లేలోపు నేను ఏ తప్పూ చేయలేదని నీకు తెలియాలి. కానీ నేను చెప్పేది నువ్వు నమ్ముతావా? నేను ఏ తప్పూ చేయలేదని నీకు ఎలా చెప్పాలి దీపా అని కార్తిక్ ఆలోచిస్తుంటాడు. అయితే కార్తీక్ చేసిన తప్పేంటి? కార్తీక్‌ని దీప ఎందుకు దూరం పెడుతుంది? ఎందుకు అసహ్యించుకుంటుంది. నేను ఏ తప్పూ చేయలేదు దీపా అని కార్తీక్ అంటే.. నిన్ను నమ్మను బాబూ అని దీప ఎందుకు అంటుంది? వీళ్ల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.