English | Telugu

నీ మొహం అద్దంలో చూసుకున్నావా..?

అందం కంటే టాలెంట్ చాలా ముఖ్యమని చెబుతుంటారు. నల్లగా ఉన్న రజినీకాంత్ సౌతిండియన్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ప్రతిభ ఉంటే రంగు అడ్డం కాదని నిరూపించారు. అయితే ఇప్పటికీ మన దేశంలో వర్ణవివక్ష ఉంటూనే ఉంది. నల్లగా ఉన్నవారిని కామెంట్ చేస్తూనే ఉంటారు. అయితే అదే నలుపు రంగుతో బుల్లితెరపై ఫేమస్ అయ్యాడు ఇమ్మానుయేల్‌. 'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఈ కమెడియన్.. నల్లగా ఉన్నానని కుంగిపోకుండా.. గెలుపు కోసం పరుగులు తీస్తున్నాడు.

తన రంగుతోనే డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా ఎదిగాడు. లేడీ కమెడియన్ వర్ష.. 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇవ్వగానే ఇమ్మానుయేల్ కెరీర్ మరింత ఊపందుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో.. ఇమ్మాన్యుయేల్ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో అత‌ను ముచ్చటిస్తుంటాడు. రీసెంట్‌గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఈ కమెడియన్‌కు నెటిజన్ల నుండి పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. కొందరు కావాల‌ని టార్గెట్ చేస్తూ.. ప్రశ్నలు వేసినా.. నవ్వుతూనే సమాధానాలు ఇచ్చాడు.

అందులో కొందరు 'కలర్ ఫోటో' సినిమాకి సీక్వెల్ తీయమని సలహా ఇచ్చారు. మరికొందరు పెళ్లి గురించి అడిగారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. ''నీ మొహం అద్దంలో చూసుకున్నావా..?'' అని అవమానించేలా ప్రశ్నించాడు. అయినప్పటికీ ఇమ్మాన్యుయేల్ సరదాగానే బదులిచ్చాడు. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు పెదవి విరిచే ఓ ఎక్స్‌ప్రెష‌న్‌తో కౌంటర్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. అయితే ఇలా ఒక వ్యక్తి ప్రతిభ గుర్తించకుండా.. కలర్ మీద కౌంటర్ వేయడంతో సదరు నెటిజన్‌పై మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ఇమ్మాన్యుయేల్ ను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదేమైనా వ‌ర్ణ వివ‌క్ష‌పై మ‌న‌వాళ్ల‌లో చైత‌న్యం పెరిగింద‌ని సంతోష‌ప‌డొచ్చు.