English | Telugu
ఆ కెమెరామన్ నన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు!
Updated : Apr 23, 2021
బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'స్పీడున్నోడు' వంటి సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలోనే సీరియల్ ఆర్టిస్ట్ నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను, వర్క్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది.
శ్యామల సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆమె సొంతూరు కాకినాడ. సినిమా అవకాశాల కోసమే ఆమె హైదరాబాద్‌కు వచ్చిందట. అయితే ఆమెకి సక్సెస్ అంత సులువుగా రాలేదట. అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదుర్కున్నానంటూ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో శ్యామల చెప్పుకొచ్చింది.
కెరీర్ ఆరంభంలో శ్యామల కొన్ని సీరియల్స్‌లో నటించిందట. ఆ సమయంలో ఓ పేరున్న కెమెరామన్ తనను వేధింపులకు గురి చేశాడని శ్యామల చెప్పుకొచ్చింది. అతను శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని.. అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతను చెప్పిన మాట గనుక వినకపోతే.. అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించేవాడని చెప్పింది. దీంతో అతడి వేధింపుల గురించి సీరియల్ దర్శకనిర్మాతలకు చెప్పడంతో.. అప్పటినుండి వేధింపులు తగ్గాయని.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
అయితే ఆ కెమెరామన్ ఎవరనే విషయాన్ని మాత్రం శ్యామల బయటపెట్టలేదు. ఇక మీడియాలో తన భర్తతో విడిపోయినట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. రీసెంట్ గా తమ పెళ్లి రోజున ఇద్దరం కలిసి కవర్ సాంగ్ కూడా చేశామని తెలిపింది.