English | Telugu
'జబర్దస్త్' పేరుతో మోసాలు.. వార్నింగ్ ఇచ్చిన కమెడియన్!
Updated : Apr 23, 2021
బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు గుర్తింపు లభించింది. ఆర్థికంగా కూడా ఈ షో చాలా మందిని ఆదుకుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో కూడా రాణిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఈ షో పేరుని వాడుకుంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై కమెడియన్ రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మొదట్లో చిన్నపిల్లలతో ఎక్కువగా స్కిట్ లు చేసిన రాకేష్.. ఆ తరువాత నటి రోహిణితో ఎక్కువగా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా రాకేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో 'జబర్దస్త్' పేరుతో మోసాలు చేస్తున్నారని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 'జబర్దస్త్' షోలో అవకాశం వస్తుందని ఆశపడి.. మోసగాళ్ల మాటలు నమ్ముతున్నారని చెప్పాడు.
'జబర్దస్త్' షో అవకాశం కావాలంటే ఎవరికి వారే వెతుక్కోవాలని.. ఈ షోలో అవకాశాలు ఇచ్చేవాళ్లు డబ్బులు వసూలు చేయరనే విషయాన్ని గుర్తించుకోవాలని రాకేష్ తెలిపాడు. రాకేష్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ 'చంటబ్బాయ్'లో ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది తన పేరు వాడుకొని పెద్ద మొత్తంలో డబ్బుని వసూలు చేశారని.. ఇకపై అలా ఎవరైనా చేస్తే దయచేసి తనకు కామెంట్ల రూపంలో తెలియజేయాలని అతను కోరాడు.