English | Telugu
ఇంకెన్ని డిజాస్టర్స్ సంభవించాలి.. అనసూయ ఫైర్!
Updated : Feb 8, 2021
ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా ధౌలిగంగా నది ఉధృతంగా పోటెత్తడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ నిర్మిస్తోన్న రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆదివారం నుంచీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విషాదమేమంటే ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 170 మంది సిబ్బంది గల్లంతయిపోయారు. వారిలో ఎంతమంది మృత్యువాతపడ్డారు, ఎంతమంది ప్రాణాలు దక్కించుకున్నారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.
ఈ విషాదం అందరినీ కదిలించి వేస్తోంది.. అందరి హృదయాలనీ కలచివేస్తోంది. ఈ ఉత్పాతానికి ఎవరు బాధ్యులంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ రావడం వల్లే ఇలాంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయని విమర్శిస్తున్నారు.
మన ఫైర్ బ్రాండ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సైతం ఈ విషాదంపై తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. "మరో ప్రకృతి వైపరీత్యం మనల్ని తాకింది. ఇది మనం ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, దానిని సంరక్షించడం మొదలుపెట్టాల్సిన సమయం కాదా? మనం నేర్చుకోవడానికి ముందు ఇంకెన్ని ఉత్పాతాలు సంభవించాలి?" అంటూ ఆమె ఆగ్రహంతో ప్రశ్నించింది.
హిమాలయాలపై కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండటం వల్ల ఆ పర్వతాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దాని వల్లే మంచు చరియలు కరిగి, విరిగి పడుతున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలంటున్నారు.