English | Telugu
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్.. అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ ప్రొఫైల్ ఇదే!
Updated : Sep 6, 2021
బిగ్ బాస్ 5 సీజన్ ఆదివారం రాత్రి గ్రాండ్‌గా మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంటరవడం విశేషం. వారిలో ఎక్కువమంది సినీ, టీవీ తారలు ఉన్నారు. ఏడో కంటెస్టెంట్‌గా నటి ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు సినిమాల్లో, మరోవైపు టీవీ సీరియళ్లలో నటిస్తూ, అందమైన తారగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. ఇటీవల 'ఉప్పెన' మూవీలో విజయ్ సేతుపతి భార్యగా, హీరోయిన్ కృతి శెట్టి తల్లిగా ఆమె కనిపించారు.
ప్రియ పూర్తిపేరు మామిళ్ల శైలజాప్రియ. గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టి పెరిగిన ఆమె సినిమాల మీద మోజుతో 19 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేసిన 'మాస్టర్', 'అన్నయ్య' సినిమాల్లో నటించడం ద్వారా దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా అన్నయ్య సినిమాలో హీరోయిన్ సౌందర్య ఫ్రెండ్‌గా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సౌందర్యతో కలిసి పలు సినిమాల్లో నటించారు ప్రియ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్‌తో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్‌తోనూ ఆమె నటించారు.
టీవీ తెరపైనా రాణించారు ప్రియ. 'ప్రియసఖి' సీరియల్‌తో ఉత్తమనటిగా నంది అవార్డును అందుకున్నారు. వాణి రాణి, నందిని వర్సెస్ నందిని, చిన్న కోడలు, నంబర్‌వన్ కోడలు లాంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు చేశారు. ఇటు వెండితెర, అటు బుల్లితెరపై అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ప్రియ.. ఇప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యింది. ఆమె అసలు వ్యక్తిత్వం ఏమిటనేది బిగ్ బాస్ షో ద్వారా మనందరికీ తెలియనుంది.