English | Telugu
మూడు రోజుల్లో చనిపోతాననుకున్నా!
Updated : Jan 7, 2022
"మూడు రోజుల్లో చనిపోతానని, రెండు మూడు రోజుల్లో నా శవాన్ని తీసుకెళ్లి చితికి నిప్పుపెడతారని అనుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నా మైండ్ సెట్ అలా వుంది" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు హీరో డాక్టర్ రాజశేఖర్. ప్రముఖ హాస్య నటుడు అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న `ఆలీతో సరదాగా` షోలో రాజశేఖర్, జీవిత దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా డా. రాజశేఖర్ భావోద్వేగానికి లోనవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంత విరామం తరువాత డా. రాజశేఖర్ మలయాళ సినిమా ఆధారంగా రీమేక్ అవుతున్న `శేఖర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా `ఆలీతో సరదాగా` కార్యక్రమంలో రాజశేఖర్ , జీవిత సందడి చేశారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడు వేరు వేరు ప్రివ్యూ షోలకు వెళ్లి వస్తుంటే తొలిసారి చూసుకున్నామని జీవిత ఈ సందర్భంగా తెలిపింది.
`శేఖర్` కథ తనని ఎంతగానో ఎట్రాక్ట్ చేసిందని, సినిమా షూటింగ్ మొదలుపెట్టాలి అని అనుకున్న సమయంలోనే రాజశేఖర్ కోవిడ్ బారిన పడ్డారని తెలిపారు. అప్పుడు ఆయనకు ఎంత సీరియస్ అయిందో అందరికి తెలిసిందేననీ, నెల రోజుల పాటు రాజశేఖర్ ఐసీయూలో వున్నారని జీవిత ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Also Read:మహేశ్‌కు కరోనా.. స్వీయ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్!
అప్పుడే "నాకు సీరియస్ అయినప్పుడు చనిపోతానని అనుకున్నా. రెండు మూడు రోజుల్లో నా శవాన్ని తీసుకెళ్లిపోయి చితికి నిప్పుపెడతారని అనుకుంటూ వుండేవాడిని. అప్పటికి నా మైండ్ అలా వుంది"అని రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. "నటవారసులు ఉంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా?" అని అలీ అడిగితే "నాకు చాలా సార్లు అనిపించింది కానీ కుదరలేద"ని రాజశేఖర్ చెప్పడంతో అలీతో సహా అంతా నవ్వేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ వచ్చే సోమవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.