English | Telugu

ఏవయ్యా హెయిర్ స్టైలిస్ట్.. సిద్ధుకి జుట్టు దువ్వకుండా షోకి పంపావేంటి?

'అన్‌స్టాపబుల్ సీజన్ 2' హాట్ హాట్ గా స్టార్ట్ అయ్యింది. ఇంత హాట్ వద్దు అనుకున్నారేమో నెక్స్ట్ వీక్ కాస్త కూల్ చేయడానికి ఇండస్ట్రీలో బాలయ్యకు నచ్చిన ఇద్దరు కుర్రాళ్లను ఈ షోకి తీసుకొచ్చారు. వాళ్ళే డీజే టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్. నెక్స్ట్ వీక్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "ఏయ్‌.. హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడయ్యా నువ్వు.. షోకి వస్తున్న సిద్ధుకి జుట్టు దువ్వకుండా పంపించేశారు!" అని స్టార్టింగే కామెడీ చేశారు బాలయ్య.

"అది మెస్సి లుక్ సర్" అని సిద్ధు చెప్పేసరికి "అలా నేను మెస్సి లుక్ తో కనిపించిన సినిమాలన్నీ మెస్సి ఐపోయాయి" అని చెప్పి నవ్వించారు. "మీ ఇద్దరూ బయట కలిసినప్పుడు ఎన్ని పెగ్గులేస్తారు?" అని ఇద్దరినీ అడిగేసరికి నవ్వులే నవ్వులు. "ఒకడేమో మాస్ కా దాస్, ఇంకొకడు మాస్ కా బాస్.. మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. గాడ్ ఆఫ్ మాస్" అని తన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు బాలయ్య.

"ఒక అమ్మాయిని ఎలా పొగడాలో తెలీదు, కొన్ని టిప్స్ ఇవ్వండి" అని అడిగితే, "వాళ్ళను ముందు పొగడాలి, తర్వాత వాళ్ళ జుట్టు అది సరిగా లేదు అని చెప్తే చాలు" అని చెప్పారు. ఇక ఇద్దరూ కలిసి బాలయ్యని "మీ ప్రస్తుత క్రష్ ఎవరు?" అని అడిగేసరికి "రష్మిక మంద‌న్న‌" అని ఆన్సర్ ఇచ్చారు బాలయ్య.

తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కి బాలయ్య ఫోన్ చేసి "అన్ స్టాపబుల్ షోకి ఎప్పుడొస్తున్నావ్?" అని అడిగారు. "మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వచ్చేస్తాను" అన్నారు త్రివిక్ర‌మ్‌."ఎవరితో రావాలో తెలుసుగా" అని రివర్స్ లో బాలయ్య అడిగారు. పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చే బాధ్యతను త్రివిక్రమ్ అప్పగించినట్టు అర్థ‌మవుతోంది. ఇక ఈ షో అక్టోబర్ 21న ప్రసారం కాబోతోంది.