English | Telugu
ఆ రామ్ గోపాల్ వర్మ చచ్చిపోయాడా?
Updated : May 5, 2022
వివాదాస్పద అంశాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. వివాదాలనే తన సినిమాలకు కథా వస్తువుగా చేసుకుంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా సంచలనాలు సృష్టిస్తున్నారు. తనకు నచ్చిన కథలని సినిమాలుగా తీస్తుంటానని, వాటిని థియేటర్ ల కు వెళ్లి చూడాలా వద్దా? అన్నది ప్రేక్షకుల ఇష్టమంటున్నారాయన. తాజాగా లెస్బియన్ ల కథతో వర్మ రూపొందించిన చిత్రం `మా ఇష్టం`. ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో నటుడు ఆలీ నిర్వహిస్తున్న `ఆలీతో సరదాగా` కార్యక్రమంలో `మా ఇష్టం` హీరోయిన్ లు నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి సందడి చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అలీ అడిగిన పలు ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. 'శివ, క్షణక్షణం, సత్య, గోవిందా గోవిందా, రంగీలా.. సినిమాలు తీసిన ఆ రామ్ గోపాల్ వర్మ మీకు ఏమౌతారండీ?' అని అలీ.. వర్మని ప్రశ్నిస్తే.. 'ఆ రామ్ గోపాల్ వర్మ చచ్చిపోయాడు.. సినిమా సినిమాకు నేను మారిపోతూ వుంటాను` అని సమాధానం చెప్పాడు వర్మ. 'అయితే మీరే చచ్చిపోతారా? లేక ఎవరైనా చంపేస్తారా?' అని మళ్లీ అడిగాడు అలీ. దీంతో 'ఎవరో కాదు నేనే' అంటూ వర్మ స్ట్రెయిట్ గా సమాధానం చెప్పడంతో అలీ ఫక్కున నవ్వేశాడు.
'మీ ఇష్టంగా మీరు ఏదైనా తీయోచ్చు.. మీ ఇష్టంగా రిలీజ్ చేయొచ్చు.. కానీ ఇష్టంగా థియేటర్ కి ఆడియన్స్ వస్తారా?' అని అడిగితే .. 'అది వాళ్ల ఇష్టం' అనేశారు. ఇక 'నేను ట్వీట్ చేయడం వల్ల ఎదుటి వాళ్లు బాధపడతారని మీకు అనిపించదా?' అని అలీ అడిగితే 'మనం ఏదైనా అంటే ఎదుటి వారు ఫీల్ అవుతారనుకుంటే అందరూ నోరుమూసుకుని ఇంట్లోనే కూర్చోవాల్సి వుంటుంది. నేను గత 20 ఏళ్ల నుంచి మెయింటైన్ చేస్తుంది ఒక్కటే.. నా ఇష్టం వచ్చిట్టు బతుకుతా, మీకు ఇష్టమొచ్చినట్టు మీరు చావండి' అన్నారు. ఇక ఎలక్షన్స్ లో నిలబడితే మీకు ఎన్ని ఓట్లు వస్తాయని అడిగితే ఒక్క ఓటు కూడా రాదని, ఎందుకంటే బుద్ధివున్న వాడు తనకు ఓటు వేయడని చెప్పేశాడు. అలాగే తాను ముఖ్యమంత్రి అయితే మరుక్షణం డబ్బంతా తీసుకుని విదేశాలకు చెక్కేస్తానని చెప్పడంతో అలీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ నవ్వులు పూయిస్తోంది.