English | Telugu

ఇకపై రైటర్స్ మాత్రమే డైరెక్టర్స్ !

ఇంతకుముందు రైటర్స్ వేరుగా.. డైరెక్టర్స్ వేరుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులొచ్చేసాయి. "కథ, కథనాలు ముఖ్యంకానీ.. డైరెక్షన్ ఏముంది" అనే పరిస్థితులొచ్చేసాయి. మంచి కెమెరామెన్‌ని తీసుకోవడంతోపాటు ఓ ఇద్దరు సీనియర్స్‌ను కో డైరెక్టర్స్‌గా పెట్టుకొంటే డైరెక్షన్ చేసేయొచ్చనే ధోరణి ఇప్పుడు నడుస్తోంది. తనకు కథ చెప్పడానికి వచ్చిన దశరధ్‌ను నాగార్జున డైరెక్టర్ని చేసేసినప్పట్నుంచి ఈ ట్రెండ్ మన టాలీవుడ్‌లో ఊపందుకుంది. దశరధ్‌ను స్ఫూర్తిగా తీసుకొని త్రివిక్రమ్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ తర్వాత మరికొందరు.

నిజానికి జంధ్యాల కాలం నుంచే రైటర్స్, డైరెక్టర్స్ కావడం అనేది అమల్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడది పతాకస్థాయికి చేరింది. రైటర్స్ మాత్రమే డైరెక్టర్స్‌గా రాణించగలిగే రోజులు ముందు ముందు రానున్నాయి. మోనిటర్ ముందు కూర్చుని.. తను ఊహలోని సన్నివేశం స్క్రీన్‌పై ట్రాన్స్‌లేట్ అయ్యిందో లేదో చూసుకోగలిగే అవకాశం అందుబాటులోకి రావడంతో డైరెక్షన్ చాలా ఈజీ అయిపోయింది. పైగా కొంచెం లోతుగా పరిశీలిస్తే.. సినిమా రూపకల్పనకు సంబంధించిన ప్రతి విభాగానికి ఒక హెడ్ ఉంటాడు. డాన్స్‌లకు డాన్స్ మాస్టర్, ఫైట్స్‌కు ఫైట్ మాస్టర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ వంటి అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు హెడ్స్ ఉంటాడు. డైరెక్టర్ చెయ్యాల్సిందల్లా.. వీళ్లందరి దగ్గర్నుంచి మంచి అవుట్‌పుట్ తీసుకోవడమే. అందుకే.. డైరెక్షన్‌లో ఓనమాలు కూడా దిద్దుకోకుండానే ఇప్పుడు అనేకమంది డైరెక్ట్‌గా డైరెక్టర్స్ అయిపోతున్నారు!