English | Telugu
సౌత్ లో సీక్వెల్స్ ట్రెండ్.. 'కాంతారా 2' ఎప్పుడంటే?
Updated : Jan 1, 2023
వాస్తవానికి ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ కి శ్రీకారం చుట్టిన వ్యక్తి విశ్వ నటుడు, లోక నాయకుడైన కమలహాసన్. తన సబ్జెక్టులను అనుకున్నట్టుగా తీయాలంటే ఒకే పార్ట్ లో తీయడం అసాధ్యమని భావించిన ఆయన 'విశ్వరూపం' చిత్రం విషయంలో రెండు భాగాలుగా దానిని తెరకెక్కించి విజయం సాధించారు. దాని తర్వాత టాలీవుడ్ లో రాజమౌళి 'బాహుబలి'ని కూడా మొదట అలాగే ఒకే పార్ట్ గా భావించి తర్వాత బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి -ది కంక్లూజన్ పేర్లతో రెండు భాగాలుగా తీసి చరిత్ర సృష్టించారు. దీంతో దక్షిణాదిలో కూడా బాలీవుడ్, హాలీవుడ్ తరహాలో సీక్వెల్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఒక పార్ట్ లో సినిమా తీయాలని భావించిన వారు కూడా ఇప్పుడు దానిని రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంది? తాము పెట్టే భారీ బడ్జెట్ కు ఇలా తీస్తే మంచిగా వర్కౌట్ అవుతుంది కదా? అందులో పాన్ ఇండియా చిత్రాల రేంజ్ లో తీస్తే సీక్వెల్స్ కు మరింత క్రేజ్, ఇమేజ్‌లతో పాటు ఆర్థికంగా కూడా భారీ లాభాలు వస్తాయి కదా! అనే ఆలోచనతో ఇలా శ్రీకారం చుడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కన్నడ నుంచి వచ్చిన కేజిఎఫ్ ఫ్రాంచైజ్ కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 గా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఒకే పార్ట్ అనుకున్న పుష్ప చిత్రాన్ని సుకుమార్ పుష్ప1 పుష్ప 2 గా తీస్తున్నారు. మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌కు కూడా సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. మరో వైపు ప్రశాంత్‌నీల్ కేజిఎఫ్3 కూడా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇదే బాటలో ప్రభాస్ సలార్ మూవీని కూడా సీక్వెల్ గా తీస్తారని అంటున్నారు.
ఇలా చూసుకుంటే ఇంకా రాబోయే కాలంలో సౌత్ ఇండియా నుంచి కూడా సీక్వెల్స్ హవా ఊపందుకుంటుంది. చిన్న హీరోల నుంచి పెద్ద స్టార్ల వరకు ఈ మేనియాలో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చివరకు యంగ్ హీరో అయిన నిఖిల్ సైతం కార్తికేయ విజయంతో సరిపెట్టుకోకుండా కార్తికేయ 2 తీసి పాన్ ఇండియా రేంజ్‌లో విజయం సాధించారు. దాంతో ఆయన కార్తికేయ3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. మరోవైపు యూనివర్స్ పేరుతో ఒకే టైటిల్ తో విభిన్న కథలు, విభిన్న హీరోలతో సాగే కొత్త తరహా ట్రెండ్ ను మనవారు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి అందిపుచ్చుకున్నారు. దానికి ఉదాహరణే హిట్ మూవీ. ఇప్పటికే హిట్1, హిట్ 2 రాగా.. వీటికి కొనసాగింపుగా హిట్3, హిట్4 కూడా రానున్నాయట. గతంలో ఆర్య చిత్రం తీసిన సుకుమార్- బన్నీలు అదే టైటిల్ తో ఆర్య 2 అని పెట్టి సరికొత్త కథను ప్రేక్షకులకు అందించారు. కానీ ఈ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడంతో మరల దాని వైపు దృష్టి సారించలేదు. కానీ హిట్ మూవీతో ఇప్పుడు ఈ తరహా చిత్రాలు కూడా రాబోయే కాలంలో తమ హవా కొనసాగిస్తాయని అంటున్నారు.
ఇక విషయానికి వస్తే చిన్న సినిమాగా కన్నడ సాంప్రదాయాలను సంస్కృతులను చూపిస్తూ రిషబ్ శెట్టి తానే స్వయంగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 400 కోట్లకు పైగా వసూలు సాధించి కన్నడ ఇండస్ట్రీలో రెండవ అతిపెద్ద భారీ హిట్‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ కేవలం 16 కోట్లతో రూపొందడం విశేషం. ఈ సినిమాతో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఆయనకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇతనిపై కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంతారాకు సీక్వెల్ గా కాంతారా2 ఉంటుందా లేదా అనే సందేహం తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో కాంతారా 2 ఉన్నప్పటికీ అది ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా కాంతారా 2ని వచ్చే ఏడాది నుంచే సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారు. ఈసారి బడ్జెట్ కూడా భారీగా పెంచే అవకాశం ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి కాంతారాని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. తాజాగా హోం భలే ఫిలిం అధినేత విజయ్ కిరంగదూర్ అనేక సందేహాలను పటాపంచలు చేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆ తర్వాత కాంతారా 2 మొదలవుతుంది. రెండో భాగానికి సంబంధించిన కథ సిద్దంగా లేదు. ముందు కథని సిద్ధం చేసి వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకొని వెళ్ళబోతున్నాం. వచ్చే ఏడాదంతా రిషబ్ శెట్టి ఆ పనిలోనే బిజీగా ఉండనున్నారు. కథ సంతృప్తికరంగా వచ్చిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లడం, షూటింగ్ పూర్తి చేయడం వంటివి అంతే వేగంగా జరుగుతాయని చెప్పారు. దీంతో కాంతారా2 పై అంతటా ఆసక్తి నెలకొని ఉంది.