English | Telugu

ఇండస్ట్రీ పెద్దగా ఈ వివాదంపై చిరు నోరెత్తడం లేదు ఎందుకు?

ఇండస్ట్రీ పెద్దగా ఈ వివాదంపై చిరు నోరెత్తడం లేదు ఎందుకు?

సక్సెస్ ఉన్న వారిని చూస్తే ఇండస్ట్రీలో బడాబడా వారు కూడా మౌనంగా ఉంటారు. ఎందుకంటే వారితో వారికి పనులుంటాయి. ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది. అందుకే అనవసర వివాదాలపై వారు స్పందించరు. ఇక తెలుగులో దిల్ రాజుకు నిర్మాతగా ఉన్న పేరు తెలిసిందే. అభిరుచి ఉన్న నిర్మాతగా సరైన కథలను జడ్జి చేస్తాడని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి దిల్ రాజు ఒకానొక సమయంలో పండుగల స‌మ‌యంలో తెలుగు సినిమాలకు ముందుగా థియేటర్లు కేటాయించి తరువాత మాత్రమే డబ్బింగ్ చిత్రాలకు థియేటర్లు కేటాయించాలని చెప్పి ఒక పెద్ద సంచలమే సృష్టించారు. కానీ ఇప్పుడు అదే ఆయన తన చిత్రం విష‌యానికి వ‌చ్చేస‌రికి మాట మార్చారు. 

ఒకవైపు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి భారీగా పోటాపోటీగా విడుదలగా కానున్నాయి. రెండు చిత్రాలకు భారీ స్థాయిలో థియేటర్ల అవసరం ఉంది. కానీ ఇదే సమయంలో దిల్ రాజు కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన వారిసు(తెలుగులో వారసుడు) సినిమాని నిర్మించి ఇదే సంక్రాంతి పోటీలోకి దింపుతున్నారు. ఆయన తనకున్న పలుకుబడి, తన చేతిలో ఉన్న థియేటర్లను తన చిత్రమైన వారసుడుకు కేటాయించి పలు థియేటర్లను బ్లాక్ చేస్తున్నాడని వివాదం మొదలైంది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సి కళ్యాణ్ నుంచి అందరూ ఈ విషయంపై తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపారు. 

ఇక విషయానికి వస్తే దాసరి నారాయణరావు తర్వాత తెలుగు సినీ పెద్ద అంటే ఎవరూ లేరు. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి పెద్ద అని  ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కరోనా సమయంతో పాటు పలు విషయాలలో కూడా చిరు తనదైన పెద్దరికం చూపించారు ఇక తాజాగా సంక్రాంతి పోటీకి రిలీజ్ అవుతున్న దిల్ రాజు వారసుడు వివాదంపై తెలుగు సినీ పెద్దగా చిరంజీవి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కేవలం చిరంజీవికి వ్యక్తిగత విషయం కాదు. వచ్చే ఏడాది చిరు స్థానంలో వేరే హీరో ఉన్నా ఇదే వివాదం మొదలవుతుంది. చిరు, బాలకృష్ణలైతే ఎలాగోలా ఈ పోటీని, వారసుడు బెడదను తప్పించుకోగలరేమో గానీ మిగిలిన హీరోలకు ఇలాంటి సమస్య వస్తే వారు చాలా ఇబ్బందులను పడాల్సి వస్తుంది. కాబట్టి వారసుడు మూవీ విషయంలో చిరంజీవి సరిగా స్పందించి అందుకు తగ్గ పరిష్కారాన్ని సూచించలేదని, తన వంతు అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని తేల్చి చెప్ప‌లేద‌ని పలువురు నిట్టూరుస్తున్నారు. ఒక సినీ పెద్దగా తానే ఒక అడుగు ముందుకేసి ఈ సమస్యపై స్పందిస్తే బాగుందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతోంది.