English | Telugu
అప్పుడు చిన్న చూపు.. ఇప్పుడు టాలీవుడ్ వైపే బాలీవుడ్ స్టార్స్ చూపు!
Updated : Jan 1, 2023
దక్షిణాది చిత్రాల సినిమా స్పాన్ పెరిగిన తర్వాత ఇక్కడి చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. ఇలా సౌత్ లో పాన్ ఇండియా చిత్రాలు పెరగడానికి, వాటికి దేశవిదేశాలలో గుర్తింపు రావడానికి వీటిల్లో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించడం ఓ కారణం. ఎలాంటి భేషజాలకు పోకుండా వారు మన సౌత్ ఇండియన్ చిత్రాలకు తమవంతు సాయం అందిస్తున్నారు. మన స్టార్ హీరో చిత్రాలన్నీ దేశ విదేశాలలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఎంత రెమ్యూనేషన్ అయినా ఇచ్చి వారిని తమ ప్రాజెక్టులో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్ సందడి ఎక్కువయింది.
ఒకప్పుడు ఇక్కడి సినిమాల్లో నటించాలంటే ఏదో ఒక సాకు చెప్పి బాలీవుడ్ స్టార్లు తప్పించుకునేవారు. బాలీవుడ్ హీరోయిన్లకైతే ఇక్కడ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారు కూడా ఇక్కడ నటించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ బాలీవుడ్ హీరోల విషయం అలా కాదు. వారికి సౌత్ ఇండియన్ సినిమాలంటే ఒక రకమైన చిన్నచూపు ఉంది. బాలీవుడ్ సినిమాలే జాతీయ చిత్రాలు అనే ఒక భ్రమలో వాళ్ళు ఉండిపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారు మన చిత్రాల్లో కనిపిస్తూ తద్వారా మన చిత్రాలకు ఉన్న క్రేజ్ ను అడ్డుపెట్టుకొని విజయాలతో పాటు దేశవ్యాప్త గుర్తింపును, భారీ పారితోషికాలను అందుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో అజయ్ దేవ్‌గణ్ మెప్పించారు. ఇది చిత్రానికి చాలా ప్రత్యేకతను తీసుకొని వచ్చింది. ఇదే చిత్రం ద్వారా అలియా భట్ సీత పాత్రలో నటించింది. ఇక లైగర్ చిత్రంలో అనన్య పాండే తో పాటు ఏకంగా ప్రపంచ బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ నటించిగా, కార్తికేయ 2లో అనుపమ్‌ఖేర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ఆయన ఎపిసోడ్ హైలైట్ అని చెప్పాలి. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్టు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. కేజిఎఫ్ 2 లో సంజయ్ దత్ అధీర పాత్రలో అగరగొట్టారు. ఇందులో రవీనా టాండన్ కూడా మెప్పించింది.
నిజానికి ఒకప్పుడు ఐశ్వర్యారాయ్ కోసం తెలుగు స్టార్స్ నానా పాట్లు పడ్డారు. బాలీవుడ్, కోలీవుడ్‌లకే పరిమితమైన ఈమె ఏదో రావోయి చందమామ చిత్రంలో నాగార్జున కోసం ఓ సాంగ్ లో నటించింది. ఇక సంజయ్ దత్ ను నాగార్జున ఒప్పించి చంద్రలేఖ చిత్రంలో చిన్న అతిధి పాత్ర చేయించారు. దానికి మనం ఆహా ఓహో అనుకున్నాం. ఆ తరువాత కూడా మనం సినిమాలో అమితాబ్ కొన్ని క్షణాలు తెరపై కనిపించినందుకే మనం సంబరాలు చేసుకున్నాం. బాలకృష్ణ ఎంతో ఇష్టపడి చేయాలనుకున్నా కృష్ణవంశీ చిత్రం రైతులో ఓ ప్రధాన పాత్ర కేవలం అమితాబచ్చన్ మాత్రమే పోషిస్తే బాగుంటుందని ఆయన ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో బాలయ్య వందవ చిత్రంగా రూపొందాల్సిన ఆ చిత్రం ఏకంగా ఆగిపోయిన సంగతి తెలిసింది. రాబోయే కాలంలో మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోలు మన చిత్రాలకు అడిగిన వెంటనే బెట్టు చూపించకుండా అంగీకరిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే సినీ పరిశ్రమలో వస్తున్న మార్పుల ఆధారంగా పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు బాగా తెలిసి వచ్చిందని భావించాలి.