English | Telugu

'ఫైటర్' కోసం సిక్స్ ప్యాక్‌ను బిల్డ్ చేస్తున్న రౌడీ హీరో!

ఇప్పుడు బాలీవుడ్ హీరోల మాదిరిగానే టాలీవుడ్ హీరోలు కండలు పెంచుతూ, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తూ ఫ్యాన్స్‌కి కనువిందు చేస్తున్నారు. ఆ కోవలో బక్కపలుచని హీరో విజయ్ దేవరకొండ కూడా కండలు పెంచడానికి సిద్ధమవుతున్నాడు. అవును. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయనున్న నెక్స్ట్ ఫిల్మ్ 'ఫైటర్'లో విజయ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారయ్యే ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్‌లో కనిపించాలని డైరెక్టర్ పూరి సూచించడంతో, ఆ పనిలో పడ్డాడు విజయ్. ప్రస్తుతం అతను క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. తన సీన్స్ పూర్తవగానే, ట్రైనర్ పర్యవేక్షణలో కసరత్తులు చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు విజయ్.

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తర్వాత విజయ్‌కు చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. 'నోటా' డిజాస్టర్ కాగా, 'టాక్సీవాలా'కు డబ్బులైతే వచ్చాయి కానీ, విజయ్ ఇమేజ్‌కు ఆ సినిమా ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఇక ఈమధ్య వచ్చిన 'డియర్ కామ్రేడ్' మూవీ ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేసింది. విజయ్ నుంచి తాము ఆశిస్తున్న సినిమా ఇది కాదని జనం చెప్పేశారు. ప్రెజెంట్.. సెట్స్‌పై ఉన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ సైతం చాలా కాలం క్రితమే మొదలైంది. ఈ నేపథ్యంలో విజయ్‌కు యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఇమేజ్ తీసుకు రావడానికీ, మాస్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ అవడానికీ 'ఫైటర్' మూవీ పనికొస్తుందని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిజానికి మాస్ మసాలా సినిమాలు తీయడంలో స్పెషలిస్టయిన పూరి డైరెక్షన్‌లో నటించేందుకు విజయ్ సంతకం చేసినప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయారు. కారణం.. ఇప్పటివరకూ విజయ్ ఆ తరహా సినిమాలు చెయ్యకపోవడం.

మునుపటి మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్టుతో స్క్రిప్ట్స్ విషయంలో విజయ్ పునరాలోచనలో పడ్డాడు. తన దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్స్‌లో 'ఫైటర్' స్క్రిప్టును ఎంచుకున్నాడు. యావరేజ్‌గా సాగిపోతున్న హీరో రామ్ కెరీర్ గ్రాఫ్‌ను 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఒక్కసారిగా పైకి తీసుకెళ్లిన పూరి.. తన కెరీర్ గ్రాఫ్‌కు కూడా అలాగే ఊపు తీసుకొస్తాడనే నమ్మకంతోటే మరో ఆలోచన లేకుండా ఆయన సినిమాకు ఓకే చెప్పేశాడు విజయ్. 'ఇస్మార్ట్ శంకర్' తరహాలోనే ఈ మూవీని కూడా పూరి, చార్మీ కలిసి నిర్మించనున్నారు.

జనవరిలో 'ఫైటర్' సెట్స్‌పైకి వెళ్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన పూరి, షూటింగ్ మొదలయ్యేలోగా.. ఇదివరకెన్నడూ కనిపించని రీతిలో విజయ్ లుక్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాడు. మామూలుగా సన్నగా, రివటలా కనిపించే విజయ్.. ఒక క్రమ పద్ధతిలో డైట్ ఫాలో అవడంతో పాటు బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 'ఫైటర్'లో అతను కొన్ని సన్నివేశాల్లో షర్ట్ లేకుండా కనిపిస్తాడని తెలుస్తోంది. వాటికోసమే విజయ్ సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేస్తున్నాడు.

ఇప్పటివరకూ ఈ సినిమాలో నటించే హీరోయిన్ పేరు అఫిషియల్‌గా బయటకు రాలేదు. కానీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. గతంలో తెలుగులో విజయ్ దేవరకొండ తన అభిమాన నటుడని 'కాఫీ విత్ కరణ్ జోహార్' షోలో జాన్వి తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జాన్విని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి పూరి సంప్రదించాడనీ, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అనీ వినిపిస్తోంది. ఆమే గనుక 'ఫైటర్'లో హీరోయిన్‌గా చెయ్యడానికి ఒప్పుకుంటే, విజయ్-జాన్వి జోడీ కన్నుల పండుగగా కనిపిస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.