English | Telugu
పెరిగిపోతున్న స్టార్స్ లిస్ట్.. ‘జైలర్2’లో మరో హీరో ఎంట్రీ!
Updated : Jan 15, 2026
రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కాంబినేషన్‌లో రూపొందిన ‘జైలర్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్2’ చిత్రం తెరకెక్కుతోంది. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కేమియో రోల్స్ చేయడం అనేది ‘జైలర్’ చిత్రంతోనే మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఇదే పద్ధతిని పాటించారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాల్లోనే స్టార్స్ హడావిడి ఎక్కువగా ఉందని చెప్పాలి.
‘జైలర్’ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఈ ముగ్గురూ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పుడు ‘జైలర్2’లో స్టార్ హీరోలు ఎవరెవరు కనిపిస్తారు అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న స్టార్స్ సెకండ్ పార్ట్‌లోనూ కనిపిస్తారు అనేది కన్‌ఫర్మ్ అయింది. వారితోపాటు మరికొందరు సీక్వెల్‌లో జాయిన్ అవుతారు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది.
ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.ఆమధ్య బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో ‘జైలర్2’ ప్రస్తావన తీసుకొచ్చారు. మరో స్టార్ హీరో ఆ సినిమాలో నటించబోతున్నాడంటూ హింట్ ఇచ్చారు మిథున్. అతనెవరో కాదు, బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌గానీ, షారూక్‌గానీ అఫీషియల్‌గా ఎనౌన్స్ చెయ్యకపోయినా మిథున్ వంటి స్టార్ ఈ విషయాన్ని చెప్పడంతో దాన్ని అందరూ కన్‌ఫర్మ్ చేసుకున్నారు
గత కొంతకాలంగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నాడు అనే వార్త ప్రచారంలో ఉంది. దాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో ‘నేను ‘జైలర్ 2’లో ఒక కేమియో చేశాను. రజినీ సార్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావించాను. అంతేకాదు, ఈ సినిమాలో చేయడం వల్ల ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని తెలిపారు.
గతంలో ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ వెంటనే బాలకృష్ణకి బదులుగా విజయ్ సేతుపతి ఆ క్యారెక్టర్ చేస్తున్నారనే వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అతనే స్వయంగా తను ఆ సినిమా చేశానని చెప్పారు. సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.