English | Telugu

అమితాబ్ పాత్రలో పవర్ స్టార్!

రెండేళ్ల విరామంతో పవన్ కల్యాణ్ చెయ్యబోయే సినిమా ఖరారయింది. అయితే డైరెక్టర్‌గా ప్రచారంలో ఉన్న పేరుకాకుండా సీన్‌లోకి మరో డైరెక్టర్ రావడం ఆశ్చర్యకరం. అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించగా ఘన విజయం సాధించిన 'పింక్' మూవీకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందనున్నది. ముగ్గురు యువకుల వల్ల అన్యాయానికి గురైన ముగ్గురు యువతుల తరపున కోర్టులో పోరాడిన న్యాయవాదిగా అమితాబ్ నటించిన 'పింక్'ను అనిరుద్ధరాయ్ చౌధరి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల హక్కుల్ని సీనియర్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ పొందారు.

ఆ తర్వాత ఆయన ఈ మూవీని తమిళంలో 'నెర్కొండ పార్వై' పేరుతో రీమేక్ చేశారు. అమితాబ్ కేరెక్టర్‌ను తమిళ్ అగ్ర నటుల్లో ఒకరైన అజిత్‌కుమార్ పోషించాడు. ఆ సినిమా కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఈ మూవీని దిల్ రాజుతో కలిసి తెలుగులో రీమేక్ చెయ్యాలని బోనీ కపూర్ సంకల్పించారు. లాయర్ రోల్ చెయ్యడానికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే పవన్ ఇందులో మిడిల్ ఏజ్డ్ లాయర్‌గా కనిపించడం ఖాయమన్న మాట. అయితే డైరెక్టర్‌గా ఇప్పటివరకూ క్రిష్, హరీశ్ శంకర్‌ల పేర్లు వినిపించగా, తాజాగా వాళ్ల స్థానంలో వేణు శ్రీరాం పేరు వచ్చింది. 'ఓ మై ఫ్రెండ్'తో డైరెక్టర్‌గా పరిచయమైన వేణు శ్రీరాం రూపొందించిన రెండో సినిమా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా సూపర్ హిట్టయింది. ఈ రెండు సినిమాల్నీ నిర్మించింది దిల్ రాజు. ఇప్పుడు అతని మూడో సినిమాకీ ఆయనే ప్రొడ్యూసర్ అవుతుండటం గమనార్హం. దిల్ రాజు వల్లే ఈ మూవీ డైరెక్టర్‌గా వేణు శ్రీరాం పేరు తెరపైకి వచ్చింది. కాగా హిందీలో తాప్సీ, తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.

రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన 'అజ్ఞాతవాసి' మూవీ ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నమోదయింది. దాని తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి, నటనకు తాత్కాలికంగా దూరమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 'జనసేన' దారుణ ఓటమితో ఆయన మళ్లీ సినిమాల్లోకి వస్తారనే ప్రచారం నడుస్తూ వస్తోంది. ఇప్పుడది నిజమవుతోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, మిగతా పాత్రధారులెవరనే విషయం అతి త్వరలోనే వెల్లడి కానున్నది.