English | Telugu

టాప్‌ ఇండియన్‌ డైరెక్టర్లను నిండా ముంచిన కమల్‌హాసన్‌!

సౌత్‌ ఇండియన్‌ హీరోలైన రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ కెరీర్‌ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. ఇద్దరూ కె.బాలచందర్‌ సినిమాల ద్వారానే బాగా పాపులర్‌ అయ్యారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. తమ పెర్‌ఫార్మెన్స్‌తో తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకొని అభిమానుల్ని సంపాదించుకున్నారు. రజినీకాంత్‌ పక్కా కమర్షియల్‌ సినిమాల వైపు వెళితే, కమల్‌హాసన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కమల్‌హాసన్‌కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘నాయకుడు’. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మమ్ముట్టి కాంబినేషన్‌లో చేసిన ‘దళపతి’ రజినీకాంత్‌కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్‌, కమల్‌హాసన్‌లతో మళ్ళీ సినిమా చెయ్యలేదు మణిరత్నం.

‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన శంకర్‌.. ఆ తర్వాత ‘ప్రేమికుడు’ చిత్రంతో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కమల్‌హాసన్‌తో 1996లో చేసిన ‘భారతీయుడు’ చిత్రంతో ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌, అర్జున్‌, విక్రమ్‌ వంటి హీరోలతో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు శంకర్‌. 2007లో రజినీకాంత్‌తో ‘శివాజీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించారు. ఆ తర్వాత వెంటనే కమల్‌హాసన్‌తో ‘రోబో’ చిత్రాన్ని చెయ్యాలనుకున్నారు. ఆ సమయంలో కమల్‌ బిజీగా ఉండడంతో మళ్ళీ రజినీతోనే ఆ సినిమా చేసి మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్‌ కెరీర్‌ గ్రాఫ్‌ తగ్గుతూ వచ్చింది. వరసగా అతను చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఆ సమయంలో కమల్‌తో ‘భారతీయుడు2’ ప్లాన్‌ చేశారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అందులో భాగంగానే త్వరలో ‘భారతీయుడు3’ కూడా రాబోతోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే.. మరోపక్క తనకు ‘నాయకుడు’ చిత్రంతో సూపర్‌ స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన మణిరత్నంతో దాదాపు 38 సంవత్సరాల తర్వాత ‘థగ్‌లైఫ్‌’ చిత్రం చేశారు కమల్‌. ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకొని తీవ్ర విమర్శలకు లోనైంది. ఇప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా డైరెక్టర్‌గా ఎప్పుడూ ఫెయిల్‌ అవ్వలేదు. తన మార్క్‌ టేకింగ్‌తో, విజువల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. ‘థగ్‌లైఫ్‌’ చిత్రంలో మాత్రం అలాంటి మెరుపులు ఏమీ లేకుండా పోయాయి. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా తిప్పికొట్టారు. అలా ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం, శంకర్‌లను కమల్‌హాసన్‌ నిండా ముంచినట్టయింది. మరోపక్క శంకర్‌, మణిరత్నం వంటి వెటరన్‌ డైరెక్టర్ల జోలికి వెళ్ళకుండా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూ సూపర్‌హిట్స్‌ అందుకుంటున్నారు రజినీకాంత్‌. చాలాకాలం తర్వాత తనకు ‘జైలర్‌’తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో ‘జైలర్‌2’ చేస్తున్నారు. అలాగే వరస విజయాలతో దూసుకెళ్తున్న లోకేష్‌ కనకరాజ్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు రజినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.