English | Telugu
టాలీవుడ్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తెలుగు విలన్ మృతి!
Updated : Jul 31, 2025
ఇటీవలి కాలంలో రకరకాల కారణాలతో చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో విషాదకరమైన వార్త వినాల్సి వస్తోంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో విలన్లకు, విలన్ గ్యాంగ్‌లో ఉండే ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. అలా విలన్ గ్యాంగ్‌లో కనిపించే ఫిష్ వెంకట్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూశారు. ఇప్పుడు అలా విలన్ గ్యాంగ్‌లో కనిపించే బోరబండ భాను బుధవారం కన్నుమూశారు. మిత్రులు ఆహ్వానించడంతో గండిపేట వెళ్లిన భాను అక్కడ జరిగిన పార్టీలో పాల్గొన్నారు. తిరిగి వస్తున్న సమయంలో గండిపేట సమీపంలోనే ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలపాలైన భాను స్పాట్‌లోనే చనిపోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
భాను మరణంతో ఆ తరహా క్యారెక్టర్లు పోషిస్తున్న అతని మిత్రులు, మిగతా నటులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్నింటి కంటే బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. గండిపేటలోని తన స్నేహితులతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తను ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్నానని, బాగా ఎంజాయ్ చేస్తున్నానని హైదరాబాద్‌లోని మిత్రులకు ఓ వీడియో సందేశం పంపించారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే భాను ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది. భాను ఎంతో సరదాగా ఉండే మనిషనీ, అతని మరణం తమకు ఎంతో బాధ కలిగిస్తోందని అతని స్నేహితులు, సహచర నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.