English | Telugu

ఇంకెన్నాళ్లీ ఊచకోత.. ఇకనైనా మారండి.. తెలుగు సినిమాని కాపాడండి!

తెలుగు సినిమాకు వందేళ్ళ చరిత్ర ఉంది. ఈ వందేళ్ళలో వివిధ రూపాలను సంతరించుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో కళాఖండాలు, మనసుకు హత్తుకునే సినిమాలు, మధురానుభూతుల్ని పంచిన సినిమాలు మనకు కనిపిస్తాయి. ఈ వందేళ్ళలో వివిధ రూపాల్లో కనిపించిన తెలుగు సినిమా ప్రస్తుతం ఒక భయానక రూపంలో అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొందరు దర్శకుల పైశాచికత్వం పరాకాష్టకు చేరింది. ఎప్పటి నుంచో తమలో దాగి ఉన్న పైత్యాన్ని బయటకు తెచ్చి జనంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలుగు తెరపై రక్తపాతాన్ని మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. ఈ వందేళ్ళలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారితే మారి ఉండొచ్చు. కథల పరంగా, క్యారెక్టర్ల పరంగా, జోనర్స్‌ పరంగా మార్పులు అనేవి సహజం. అంతే తప్ప తమకు కత్తులతో నరుక్కునే సన్నివేశాలు కావాలి, రక్తం ఏరులై పారితే చూడాలని ఉంది.. అని ఎవరైనా చెప్పారా? మరెందుకీ రక్తపాతం?

ఒకప్పటి సినిమాల్లో కూడా యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండేవి. కానీ, అవి మనసుని కలచివేసేవి కావు. హీరో, విలన్‌ చేసే ఫైట్స్‌ని ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా దాన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే భావించి ఎంజాయ్‌ చేసేవారు. అలాంటి సినిమాలు పిల్లలతో చూసేందుకు ఇబ్బంది పడేవారు కాదు. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగి మనుషుల్ని రోప్‌లతో విన్యాసాలు చేయించడం ద్వారా ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారని ఆ తరహా ఫైట్స్‌ని కూడా కంపోజ్‌ చేసేవారు. అలాంటి ఫైట్స్‌ కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేశారు. మరి ఉన్నట్టుండి మన దర్శకుల్లో కొందరికి ఏమైందో తెలీదు. వారిలోని సైకోలను బయటికి తెచ్చి ప్రేక్షకుల మీద ప్రయోగిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా విచక్షణా రహితం కత్తులను వాడుతున్నారు. ఒక మనిషికి సంబంధించిన పార్టులను కత్తితో ఏ విధంగా నరకవచ్చు అనేది స్లో మోషన్‌లో మరీ చూపిస్తున్నారు. ఒక సినిమాలో వర్కవుట్‌ అయింది కదా అని దాన్నే అన్ని సినిమాలకు అప్లై చెయ్యడం ఎంతవరకు కరెక్ట్‌?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న కొందరు దర్శకులకు కథపై కమాండ్‌ లేదు, కథనంపై కమాండ్‌ లేదు, డైలాగులతో ఆకట్టుకోలేరు. కేవలం కత్తులు, రక్తపాతాలు చూపించి మార్కులు కొట్టెయ్యాలని చూస్తున్నారు. ఇప్పుడు మన సినిమాల్లో తల నరికేయడం, అది ఎగిరి అవతల పడడం అనేది సర్వసాధారణమైన సీన్‌. ఇలాంటి సీన్స్‌ తియ్యడం వల్ల దర్శకుడికి ఒరిగేదేమిటో, దాన్నుంచి ఆడియన్స్‌ ఎలాంటి వినోదాన్ని పొందుతారో ఆ సన్నివేశాన్ని సృష్టించే డైరెక్టర్‌కే తెలియాలి. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల్లో అత్యంత దారుణమైన హత్యలు మనకు కనిపిస్తాయి. నిజ జీవితంలో కూడా ఇలాంటి హత్యల గురించి విని ఉండం. అలాంటి ఒళ్ళు గగుర్పొడిచే హత్యలను ఎంతో సహజంగా చూపించేందుకు దర్శకుడు పడే తపన అంతా ఇంతా కాదు.

ఈమధ్యకాలంలోనే ఈ తరహా వైఖరి మన తెలుగు సినిమాలతోపాటు తమిళ్‌, కన్నడ భాషా చిత్రాల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు సౌత్‌ డైరెక్టర్లు బాలీవుడ్‌కి కూడా వెళుతున్నారు. ఈ పైత్యాన్ని అక్కడ కూడా అంటించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్‌ రావడం లేదు అని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. మారణ హోమం సృష్టిస్తున్న ఇలాంటి సినిమాలు మన దర్శకులు తీస్తున్నంత కాలం ఫ్యామిలీ ఆడియన్స్‌ గురించి నిర్మాతలు మరచిపోక తప్పదు. దర్శకులూ.. ఇంకెన్నాళ్లీ ఊచకోత.. ఇకనైనా మారండి.. తెలుగు సినిమాని కాపాడండి.