English | Telugu

‘గో బ్యాక్‌ ఆంధ్రా..’ ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ వాదుల రగడ!

తమని ఎదగనీయడం లేదని, తొక్కేస్తున్నారని ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఆ అంశం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్‌ పైడి జయరాజ్‌ ఫోటోను చిన్నగా ఎందుకు పెట్టారంటూ ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌తో వాగ్వాదానికి దిగారు పాశం యాదగిరి. ‘గో బ్యాక్‌ ఆంధ్రా..’ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫిలిం ఛాంబర్‌కి వెళ్లి వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

జూలై 29 ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి జయంతి. తెలంగాణకు చెందిన సినారె ఫోటో ఫిలిం ఛాంబర్‌లో లేకపోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ సెక్రటరీని వివరణ కోరారు. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన గొడవ గురించి నిర్మాతల మండలి ఇంకా స్పందించలేదు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న తెలంగాణ వారిపై వివక్ష చూపిస్తున్నారని గత కొన్ని రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై నిర్మాతల మండలి, చిత్ర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.