English | Telugu

సూపర్‌స్టార్‌ రియల్‌ స్టోరీతో దుల్కర్‌ సల్మాన్‌ కొత్త సినిమా?

కొంతమంది హీరోలు తాము చేసే సినిమాల విషయంలో, క్యారెక్టర్ల విషయంలో ఎంతో వైవిధ్యంగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగానే సినిమాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడున్న హీరోల్లో దుల్కర్‌ సల్మాన్‌ ఆ కోవకు చెందుతారు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నీ అలాంటివే. మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు తాను చేసిన సినిమాల ద్వారా ఎంతో దగ్గరైన దుల్కర్‌.. మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరు ‘కాంత’. తమిళ, తెలుగు భాషల్లో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణంలో దుల్కర్‌, రానా దగ్గుబాటి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావడం విశేషం. దీంతో ఈ సినిమా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

‘మహానటి’ చిత్రంలో జెమిని గణేశన్‌ పాత్రను అత్యద్భుతంగా పోషించిన దుల్కర్‌.. ఈ చిత్రంలో తొలి తమిళ సూపర్‌స్టార్‌ ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ పాత్రను పోషిస్తున్నారు. 1930వ దశకంలో విపరీతమైన పాపులారిటీ వున్న హీరో భాగవతార్‌. అతను నటుడే కాదు, సంగీత విధ్వాంసుడు కూడా. దాంతో అతన్ని తమ ఆరాధ్యదైవంగా భావించేవారు తమిళ ప్రేక్షకులు. ఆరోజుల్లోనే సినిమాకి లక్ష రూపాయలు పారితోషికం తీసుకొని చరిత్ర సృష్టించిన భాగవతార్‌ నటించిన ‘హరిదాస్‌’ చిత్రం ఒకే థియేటర్‌లో మూడు సంవత్సరాలు ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత ఒకేసారి 12 సినిమాల్లో హీరోగా బుక్‌ అయ్యారు భాగవతార్‌. అయితే ఈ సినిమాలు ప్రారంభం అవకముందే లక్ష్మీకాంతన్‌ అనే జర్నలిస్ట్‌ హత్య కేసులో భాగవతార్‌ దాదాపు 3 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు నుంచి వచ్చిన తర్వాత తనను బుక్‌ చేసుకొని అడ్వాన్స్‌ ఇచ్చిన 12 మంది నిర్మాతలకు ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టారు. కానీ, ఆయన చేసిన ఏ ఒక్క సినిమా హిట్‌ అవ్వలేదు. దాంతో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, మానసికంగా కూడా కుంగిపోయారు. అనారోగ్య కారణాల వల్ల 1959లో 49 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు భాగవతార్‌.

దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న కొత్త చిత్రం ‘కాంత’ చిత్రంలో అతని క్యారెక్టర్‌ పేరు ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌. ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఆయన పేరును ‘కాంత’ చిత్రంలో హీరోకి పెట్టడంతో ఆయన జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు భావించారు. అయితే తాజాగా విడుదలైన టీజర్‌లో ఒక హీరోకి, దర్శకుడికి మధ్య ఉన్న ఈగో క్లాష్‌ నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. దీన్నిబట్టి భాగవతార్‌ కెరీర్‌లో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్‌తోనే ఈ కథను రూపొందించారా అనే సందేహం కలుగుతోంది. ఆ రెండు క్యారెక్టర్లను దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని అద్భుతంగా పోషించారని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. సెప్టెంబర్‌ 12న తమిళ, తెలుగు భాషల్లో కాంత చిత్రం విడుదలవుతోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ‘కాంత’ ఖచ్చితంగా కనెక్ట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.