English | Telugu

ఓటీటీలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన భార‌తీయ చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'

రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఫ్యాన్స్ నుంచి హాలీవుడ్ సెల‌బ్రిటీస్ వ‌ర‌కు అంద‌ర్నీ మెప్పించింది. పీరియ‌డ్ యాక్ష‌న్ డ్రామాగా త‌యారైన ఈ సినిమా ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అత్యంత పాపుల‌ర్ ఇండియ‌న్ ఫిల్మ్‌గా రికార్డుల‌కెక్కింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1100 కోట్లను వ‌సూలు చేసింది. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ ఏడాది మార్చి 25న విడుద‌లైంది.

ప్ర‌స్తుతం 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్ష‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్‌, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన భార‌తీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింద‌ని తెలిపింది. గ్లోబ‌ల్‌గా ఈ మూవీని ఇంత దాకా 45 మిలియ‌న్ గంట‌ల సేపు వీక్షించారు. "RRR is now the most popular Indian film on Netflix around the world. Sending the biggest to fans everywhere! (sic)." అని ఆ సంస్థ ట్వీట్ చేసింది.

త‌మ వాళ్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరు స‌ల్పిన అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల‌తో క‌ల్పిత స‌న్నివేశాల‌ను సృష్టించిన రాజ‌మౌళి తీసిన ఈ సినిమాలో ఆ పాత్ర‌ల‌ను రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ పోషించ‌గా, అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, రే స్టీవెన్‌స‌న్‌, అలీస‌న్ డూడీ, స‌ముద్ర‌క‌ని కీల‌క పాత్ర‌లు చేశారు. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చ‌గా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.