English | Telugu
సిగ్గు ప్రకాష్‌రాజ్‌కే లేదు: శ్రీనువైట్ల
Updated : Oct 5, 2014
ప్రకాష్ రాజ్, శ్రీనువైట్ల.... ఈ దుమారం ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఆగడు సినిమా వచ్చి వెళ్లిపోతున్నా.. ఆ సినిమా సందర్భంగా వీరిద్దరి మధ్య రాజుకొన్న వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. నిన్న ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి..``నా కవిత వాడుకోవడానికి శ్రీనువైట్లకి సిగ్గు లేదా..`` అని ప్రశ్నిస్తే... ఈరోజు సమాధానం ఇచ్చారు. నాకు కాదు... ఓ సినిమా రన్నింగ్‌లో ఉండగా నెగిటీవ్ ప్రచారం చేయడానికి నీకే సిగ్గు లేదు... అంటూ రెచ్చిపోయారు. ఇంతకీ ఈనాటి (ఆదివారం) ప్రెస్‌మీట్లో శ్రీనువైట్ల ఏం చెప్పారంటే.
''నన్ను ఉద్దేశించి పెట్టిన ఓ ప్రెస్‌మీట్లో నాకోసం ఆయన రాసిన పద్యం అది. నాకు అంకితం కూడా ఇచ్చారు. అందుకే దానిపై నాకు హక్కుందని భావించా. అందుకే నా సినిమాలో వాడుకొన్నా. ఓ సినిమా రన్నింగ్‌లో ఉండగా నెగిటీవ్ ప్రచారం చేయడానికి మీకేమైనా సిగ్గుందా?? సినిమా పరిశ్రమపై బతుకుతూ మరో సినిమాకి నష్టం కలిగించేలా మాట్లాడడం సరైంది కాదు. దూకుడు సినిమాలోని మా డైలాగులపై మేమే ఆగడులో సెటైర్ వేసుకొన్నాం. మహేష్‌తో సహా అందరూ దానిపై క్లారిటీ ఇచ్చాం. పవన్ , ఎన్టీఆర్‌లని వాడుకొన్నానని ప్రెస్‌మీట్లో చెప్పారు. నాకు వాళ్లిద్దరంటే చాలా గౌరవం. ఎన్టీఆర్‌తో విజయవంతమైన సినిమా కూడా తీశా. మామధ్య మంచి సంబంధాలున్నాయి. ఎవ్వరినీ ఉద్దేశించి ఆ సెటైర్లు వేయలేదు. పొరపాటున కొంతమంది ప్రచారం చేసినా అది నిజం కాదు. సినిమా ఎలా తీయాలి, ఎలా తీయకూడదు అనేది ప్రకాష్‌రాజ్ దగ్గర నుంచి నేర్చుకొనే స్థితిలో నేను లేను. సినిమా రిజల్ట్ అన్ని సార్లూ ఒకేలా ఉండదు. అందరూ బ్లాక్ బ్లస్టర్లే ఇవ్వరు. ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది. అది నేరంకాదు. ఉలవచారు బిరియానీ ఫలితం అందరికీ తెలుసు. ఆ రిజల్ట్‌పై నేనెలాంటి కామెంట్ చేయలేదు. ఎలాంటి పండగా చేసుకోలేదు.
నేను కష్టపడి పైకొచ్చా. చిన్న చిన్న సినిమాలు తీసుకొంటూ ఎదిగా. రికమెండేషన్లతో రాలేదు. నా ట్రాక్ రికార్డ్, నా కష్టం చూసి మహేష్ నాకు అవకాశం ఇచ్చారు. అహంకారం తగ్గించుకోమని ఆయన సలహా ఇవ్వడం హాస్యాస్పందం. ఆయనపై ఉన్నన్ని ఎలిగేషన్లు ఎవ్వరిపైనా లేవు. మళ్లీ మళ్లీ బతిమాలి.. ఇండ్రస్ట్రీకి వచ్చారు. ఆయన్ని సినిమాలోంచి తీసేశాన్న కోపంతో కక్ష్యతో ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇకనైనా ఆయన ఇలాంటివి మానుకొంటే మంచిది. ఆయనతో పనిచేయడానికి నాకూ ఎలాంటి అభ్యంతరం లేదు. మంచి పాత్ర ఉంటే, ఆయన కావాలనుకొంటే.. ఆయన్ని సంప్రదిస్తా. ఇక్కడ అందరూ పనిచేయడానికే వచ్చారు...'' అన్నారు శ్రీనువైట్ల.