English | Telugu
యూట్యూబ్‌లో రెచ్చిపోతున్న సమంత "ఊ అంటావా మావా" సాంగ్!
Updated : Dec 15, 2021
అల్లు అర్జున్ హీరోగా నటించగా, సుకుమార్ రూపొందించిన 'పుష్ప' మూవీ డిసెంబర్ 17న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఇవన్నీ ఒకెత్తు, ఇటీవల విడుదలైన ఒక పాట ఇంకో ఎత్తు అన్నట్లు పరిస్థితి తయారయ్యింది. 'పుష్ప' సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. దేవి శ్రీప్రసాద్ ట్యూన్స్‌కు చంద్రబోస్ రాసిన పాట ఆన్‌లైన్‌ను ఊదరగొడుతోంది.
ఫిమేల్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన "ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ" పాటను సినిమాలో సమంత, అల్లు అర్జున్, డాన్సర్లు, పలువురు జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరించారు. ఈ పాటకు తెరపై సమంత చేసిన డాన్సులు, ఆమె హావభావాలు రసికులను కిర్రెక్కించడం ఖాయమని అంటున్నారు. సింగర్ ఇంద్రావతి హస్కీ వాయిస్‌కు, సమంత పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించిన లిరికల్ సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే 45 మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించింది. అందులో తెలుగు వెర్షన్ సాంగ్ వాటేనే 31 మిలియన్ వ్యూస్ పైగా ఉన్నాయి. అంతే కాదు, ఈ పాటకు 1.6 మిలియన్లకు పైగా లైక్స్ రావడం ఇంకో సంచలన విషయం.
రేపు సినిమా హాల్లో ఈ పాట ఆడియెన్స్‌ను ఓ ఊపు ఊపుతుందని యూనిట్ మెంబర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. ఈ పాటలో "మగాళ్ల బుద్ధి వంకరబుద్ధి" అనే లైన్ ఇప్పటికే కాంట్రవర్సీ సృష్టించి, ఆ లైన్‌ను మార్చమంటూ ఒక పురుషుల సంఘం కోర్టుకు వెళ్లేదాకా పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత చేసిన ఈ సిజ్లింగ్ సాంగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్.
