English | Telugu
జీ20 సమ్మిట్‌లో భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రామ్ చరణ్!
Updated : May 23, 2023
RRR మూవీలో అద్భుతమైన నటనను కనపరిచి, భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న హీరో రామ్ చరణ్ మరోసారి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్ - టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు. తన ప్రసంగంలో ఆయన తన స్వీయానుభవాలను వివరించారు. ప్రపంచంలో సినిమా షూటింగులకు సంబంధించిన లొకేషన్స్ విషయంలో మన దేశ సామర్థ్యం గురించి ఆయన గొప్పగా తెలియజేశారు. ఈ క్రమంలో భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా మనదేశం ఎలా మారిందనే విషయాలను చరణ్ బలంగా వినిపించారు. ఫిల్మ్ టూరిజం గురించి ఆయన మాట్లాడుతూనే జీ20లోని సభ్య దేశాలు మన దేశంలో చురుకైన భాగస్వామ్యం వహించాలని కోరారు.
"ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మికతలతో మిళితమైన మన గొప్పదనాన్ని సినీ రంగం తరపున తెలియజేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్‌ను ఎంతో విలువైన జీవిత పాఠాలుగా అందించే గొప్పదనం మన ఇండియన్ సినిమాల్లో ఉన్నాయి" అని ఆయన చెప్పారు
భారత పర్యాటక శాఖా మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ "రామ్ చరణ్ అద్భుతంగా తను చెప్పాలనుకున్న విషయాలను వివరించారు. ఆయన తన వినయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈ జీ20 సమ్మిట్‌కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున చరణ్‌గారు ప్రతినిధిగా రావటం గర్వంగా ఉంది. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ-పర్యాటక రంగం పట్ల ఆయన అంకితభావం మన దేశ సహజ సౌందర్యాన్ని సంరక్షించడానికి, గొప్పగా ప్రదర్శించడానికి యువతను ప్రోత్సహించటమే కాకుండా వారికి శక్తివంతమైన ప్రేరణగా నిలుస్తుంది" అన్నారు.
