English | Telugu
నాపై ఒత్తిడి తేకండి.. ఫ్యాన్స్‌కు రజనీ విన్నపం!
Updated : Jan 11, 2021
ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించకూడదనే తన నిర్ణయం గురించి పునరాలోచనలో పడేట్లు ఒత్తిడి చేయవద్దని అభిమానులను సూపర్‌స్టార్ రజనీకాంత్ అర్ధించారు. "నేను ఎన్నికల రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించడం లేదో నా ప్రకటనలో స్పష్టంగా చెప్పాను." అని ఆయన తేల్చేశారు. సోమవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ ప్రకటనలో ఆయన ఈ విషయం చెప్పారు.
ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని ఇదివరకు రజనీకాంత్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాల్సిందిగా కోరుతూ చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్ దగ్గర ఆయన అభిమానుల్లోని ఓ వర్గం ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించింది. దీనికి స్పందనగా సోమవారం రజనీ నుంచి ట్విట్టర్ ద్వారా ప్రకటన వచ్చింది.
2020 డిసెంబర్ 29న ట్విట్టర్ ద్వారా వెలువరించిన ఓ సుదీర్ఘ లేఖలో తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ, ఇలాంటి స్థితిలో పార్టీని ప్రారంభించి ఎన్నికల రాజకీయాల్లోకి రాలేనని రజనీకాంత్ వెల్లడించారు. మొదట ఆయన నిర్ణయానికి షాక్ తిన్నప్పటికీ, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరైన రీతిలో అభిమానుల్లో అత్యధిక శాతం మంది, రజనీ మక్కల్ మాండ్రమ్ (ఆర్ఎంఎం) సభ్యులు ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు.
ఆర్ఎంఎం నుంచి బహిష్కరణకు గురైన కొంతమందితో కలిసి కొంతమంది అభిమానులు ఆదివారం తన నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడంపై రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అది ఆర్ఎంఎం నిర్ణయానికి విరుద్ధమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ర్యాలీలను కొనసాగించే ప్రయత్నాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ప్రజలకు ఇబ్బందులు కలిగించని రీతిలో ఆదివారం ర్యాలీ నిర్వహించిన తీరుపై ఊరట చెందారు.