English | Telugu
కరోనా లక్షణాలంటూ కంగారుపెట్టిన టాప్ యాంకర్.. కరోనా ఉందా? లేదా?
Updated : Jan 11, 2021
సాధారణంగా ఎవరైనా టెస్ట్ చేయించుకొని పాజిటివ్ అని నిర్ధారణ అయితేనే తమకు కొవిడ్-19 సోకిందని బహిర్గతం చేసి, తమతో సన్నిహితంగా మెలగిన వారిని అప్రమత్తం చేస్తారు. కానీ తన రూటే వేరు అన్నట్లు టాప్ టీవీ యాంకర్ అనసూయ టెస్ట్ రిజల్ట్ రాకముందే, తనకు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ కాకముందే, అందరినీ అప్రమత్తం చేశారు. నిజం చెప్పాలంటే, కంగారు పెట్టారు. ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయంట. అందుకని తనతో ఇటీవల సన్నిహితంగా గడిపిన వాళ్లు టెస్ట్ చేయించుకొమ్మని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కోరారు. గమనించాల్సిన విషయమేమంటే, ఆ పోస్ట్ పెట్టే సమయానికి ఆమె కనీసం టెస్ట్ కూడా చేయించుకోలేదు.
ఆదివారం ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో, "అందరికీ హలో.. ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొనడం కోసం కర్నూలుకు వెళ్లాలని త్వరగా నిద్రలేచాను. కానీ కొన్ని కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్లు గ్రహించి, నా షెడ్యూల్‌ను కేన్సిల్ చేసుకున్నాను. పగటి వెలుతురు క్షీణించకముందే సాధ్యమైనంత త్వరగా టెస్ట్ చేయించుకుంటాను. గత కొద్ది రోజులుగా నాకు దగ్గరగా మెలగిన ప్రతి ఒక్కరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను." అని రాసుకొచ్చారు.
రెండు రోజుల క్రితమే ఆమె ఓ వెబ్ సిరీస్ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డ దంపతులు కూడా పాల్గొన్నారు. అంతే కాదు, డైరెక్టర్ వినాయక్, సీనియర్ రైటర్ వి. విజయేంద్రప్రసాద్ సైతం అతిథులుగా హాజరయ్యారు. వీరంతా అనసూయకు దగ్గరగా మెలగినవాళ్లే. నిహారిక, చైతన్య అయితే అనసూయతో కలిసి ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. వారంతా ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాల్సిందేనన్న మాట.
ఇంకో సంగతేమంటే.. ఇంతదాకా తను టెస్ట్ చేయించుకున్నదీ, లేనిదీ అనసూయ వెల్లడించలేదు. నిన్నే టెస్ట్ చేయించుకున్నట్లయితే ఈసరికి ఎప్పుడో రిజల్ట్ తెలిసి ఉండేది. కానీ ఒక రోజు గడిచిపోయినా దీనిపై ఆమె అప్‌డేట్ ఇవ్వలేదు. అసలు.. టెస్ట్ చేయించుకోకుండానే, తనకు కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేంటి, మిగతావాళ్లను కంగారుపెట్టడమేంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.