English | Telugu
చిన్న సినిమాలు చెలరేగాయ్
Updated : Dec 29, 2015
2015 డైరీ తిరగేస్తే.. బాహుబలి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ కనిపించొచ్చు. యేడాదంతా ఈసినిమాల గురించే అభిమానులు మాట్లాడుకొని ఉండొచ్చు. కానీ.. చిన్న సినిమాలు సాధించిన విజయాల్ని మర్చిపోకూడదు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి నుంచి బయటపడి... పెద్ద సినిమాలకు పోటీగా వసూళ్లు సాధించి సత్తా చాటుతున్నాయి. 2015లో అలాంటి సినిమాలొచ్చాయ్.
కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన సినిమా చూపిస్త మావ ఏకంగా రూ.10కోట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈసినిమాతో రాజ్ తరుణ్ కమర్షియల్ హీరో అయిపోయాడు. హ్యాట్రిక్ మూవీగా వచ్చిన కుమారి 21 ఎఫ్ కుర్రకారుకి తెగ నచ్చేసింది. ఈ సినిమా బడ్జెట్ కూడా మూడున్నర కోట్ల లోపే. అయితే రూ.16 కోట్లతో.. కాసుల వర్షం కురిపించుకొంది.
రాజుగారి గదిని కూడా రెండున్నర కోట్లలో తీసేశారు. ఆ సినిమాకి పది కోట్లకు పైనే వసూళ్లొచ్చాయి. ఇటీవల విడుదలైన భలే మంచి రోజు కూడా... హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అన్నింటికంటే మించి.. భలే భలే మగాడివోయ్.. పెద్ద చిత్రాలకే షాక్ ఇచ్చింది. రూ.6 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.35 కోట్లు దక్కించుకొంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా పది కోట్ల మైలు రాయిని చేరుకొంది.
రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్లకు నాలుగు రూపాయలు మిగిల్చింది. చిన్న సినిమాల్లో భారీ లాభాలు తెచ్చిన పెట్టిన భలే భలే మగాడివోయ్ ఈ యేడాది చిన్నసినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ అనిచెప్పొచ్చు. లాభాల శాతంతో పోలిస్తే... బాహుబలినే మించి పోయింది ఈ సినిమా. మరి 2016లోనూ చిన్న సినిమా ఇలానే విజృంభిస్తుందేమో చూడాలి.