English | Telugu
వినాయక్ హీరో... పూరి జీరో
Updated : Apr 19, 2016
పూరి జగన్నాథ్ Vs డిస్టిబ్యూటర్స్ వ్యవహారంలో... అందరి వేళ్లూ ఇప్పుడు పూరి జగన్నాథ్ వైపుకే చూపిస్తున్నాయి. ఈ విషయంలో తప్పంతా పూరిదే అంటూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. నాలుగ్గోడల మధ్య తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని రోడ్డు కీడ్చి, పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లి, కేసులు పెట్టి నానా హంగామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పూరిని నిలదీస్తోంది ఇప్పుడు చిత్రసీమ.
ఓ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ నిర్మాతతోనే ముడిపడి ఉంటాయి. దాన్ని కాదనలేం. ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ పంపిణీదారులు కాస్తో కూస్తో నష్టాన్ని భర్తీ చేయమని నిర్మాతనే బతిమాలుకొంటుంటారు. ఓ సినిమా ఫ్లాప్ అయితే.. ముందు మునిగిపోయేది నిర్మాతే. అందుకే ఆ సినిమాతో లాభపడిన హీరో, దర్శకుడి వైపు చూసి చేతులు చాచాల్సిన పరిస్థితి వస్తోంది. ఓ సినిమాకి ఆరు నుంచి ఏడు కోట్లు పారితోషికం తీసుకొనే దర్శకుడు పూరి జగన్నాథ్. అందులో కాస్తయినా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని అభ్యర్థించారు.. పంపిణీదారులు. ఇది డిమాండ్ కాదు.. కేవలం అభ్యర్థన మాత్రమే. దానికే పూరి ఇంత రాద్ధాంతం చేయాలా;?
అఖిల్ సినిమా విషయంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొంది. ఆసినిమా వల్ల అందరూ భారీ ఎత్తున నష్టపోయారు. కానీ వి.వి.వినాయక్ నైతిక బాధ్యత తీసుకొన్నాడు. సినిమా విడుదలైన రెండో రోజే డిస్టిబ్యూటర్లకు ఫోన్ చేసి 'మీకు నేనున్నా.. అధైర్యపడొద్దు' అని ధైర్యం ఇచ్చాడు. తాను అందుకొన్న పారితోషికం నుంచి సుమారు రూ.3 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. దాంతో అఖిల్ కొన్న వాళ్లంతా మళ్లీ కోలుకొన్నారని కాదు.. కాస్తయినా స్వాంతన లభించింది. ఇప్పుడు పూరి కూడా అదే చేయాల్సింది. నష్టపరిహారం తన వల్ల కాకపోతే దాన్నే సున్నితంగా చెప్పాల్సింది. అంతే తప్ప.. ఇంత రాద్దాంతం చేయాల్సింది కాదు. ఈ ఎపిసోడ్‌తో తేలిందేమిటి? పూరి లాభపడిందేమిటి? డిస్టిబ్యూటర్ల దృష్టిలో వినాయక్ మరోసారి హీరో అయ్యాడు.. పూరి జీరోగా మిగిలిపోయాడంతే. ఈ యాంటీ క్లైమాక్స్‌ని పూరి కూడా ఊహించి ఉండడు.