English | Telugu
ట్రావెల్ బస్సుల్లో ప్లే అవుతున్న విజయ్ "పోలీస్"
Updated : Apr 18, 2016
పైరసీ...ఈ పదం వింటే సినీ ప్రపంచం వణికిపోతోంది. కోట్ల రూపాయల ఖర్చుని..సంవత్సరాల కష్టాన్ని రాత్రికి రాత్రి దోచేసే రాక్షసి పైరసీ. ఉదయం సినిమా విడుదలైతే మధ్యాహ్నం సినిమా నెట్‌లోకి వచ్చేస్తుంది. దీంతో ఎంతోమంది కష్టం బుగ్గిపాలవ్వడంతో పాటు నిర్మాతకు భయంకరమైన నష్టాలు మిగులుతాయి. పైరసీ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పడానికి తాజా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తేరి సినిమా శుక్రవారం రిలీజైంది. ఆ సినిమాను తెలుగులో పోలీస్‌గా విడుదల చేశారు. ఈ సినిమాను బాహాటంగానే ఏసీ బస్సులో వేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
తిరుచ్చి నుంచి తంజావూరుకు వెళ్తున్న ఏసీ బస్సులో ప్రదర్శించారు. అయితే ఇదే బస్సులో ప్రయాణిస్తున్న విజయ్ అభిమాని తమ వాళ్లకు ఫోన్ చేసి చెప్పడంతో తంజావూరుకు చేరుకున్న వెంటనే విజయ్ అభిమానులు బస్సును చుట్టుముట్టారు. వెంటనే బస్సును అణువణువు తనిఖీ చేసి సీడీనీ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం నిర్మాతల దాకా వెళ్లడంతో వారు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో తమిళనాడులోని సీడీ షాపులపై దాడులు చేసి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.