English | Telugu
త్వరలో 'పెళ్లి చూపులు' రీ రిలీజ్
Updated : Jul 16, 2023
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఇప్పటిదాకా రెండు సినిమాలు వచ్చాయి. అవే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?'. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మూడో సినిమాగా 'కీడా కోలా' రూపొందుతోంది. ఇటీవల ఆయన రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది?' రీ రిలీజ్ అయ్యి స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' కూడా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.
విజయ్ దేవరకొండ కెరీర్ లో సోలో హీరోగా విడుదలైన మొదటి సినిమా 'పెళ్లి చూపులు'. 2016 జూలైలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో అతికొద్ది కాలంలోనే స్టార్ గా ఎదిగాడు విజయ్. హీరోగా అతని కెరీర్ కి పునాదిగా నిలిచిన 'పెళ్లి చూపులు' త్వరలో థియేటర్లలో మళ్ళీ అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత యష్ రంగినేని ప్రకటించారు.
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించిన 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' సినిమా జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన యష్ రంగినేని.. 'డియర్ కామ్రేడ్', 'పెళ్లి చూపులు' సినిమాల రీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. "విజయ్ దేవరకొండతో మేము నిర్మించిన డియర్ కామ్రేడ్, పెళ్లి చూపులు సినిమాలను త్వరలో రీ రిలీజ్ చేస్తాం. డియర్ కామ్రేడ్ మేము ఊహించినంత రీచ్ కాలేదు. అయితే మా పెట్టుబడి మాకు వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర రెండు స్క్రిప్ట్స్ ఉన్నాయి. అయితే విజయ్ తో కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం" అన్నారు. అలాగే 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' సినిమా అన్ని కమర్షియల్ అంశాలున్న జెన్యూన్ మూవీ అని చెప్పుకొచ్చారు.