English | Telugu
పవన్ గట్స్... ఇంకెవరికి సాధ్యం??
Updated : Apr 5, 2016
మీ అభిమాన కథానాయకుడు ఎవరూ... అని మన టాప్ హీరోలెవ్వరినైనా అడిగిచూడండి. ఏ ఇబ్బందీ లేకుండా ఏ అమితాబ్ బచ్చన్ పేరో.. జాకీచాన్ పేరో చెబుతారు. టాలీవుడ్‌లో అంతకు మించిన పోటుగాళ్లు లేరని కాదు, ఎవరి పేరు చెబితే ఏం అయిపోతుందో, ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో, సొంత ఇమేజ్‌ని చిన్న బుచ్చుకొంటున్నట్టు ఉంటుందేమో అని భయం. చరణ్‌ని అడిగితే.. చిరంజీవి అంటాడు. బన్నీని అడిగినా అదే మాట చెబుతాడు. ఎన్టీఆర్ ని అడిగితే.. 'నా గురువు దైవం అంతా తాతయ్యే' అని పాత పాట పాడతాడు. కానీ పవన్ ఏం చెప్పాడో తెలుసా..?? ''నా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన ఇమేజ్, ఆయన అభిమానగణం ఎవ్వరికీ రాలేదు'' అంటూ.. ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా సమాధానం చెప్పాడు.
కొణిదెల ఫ్యామిలీ - నందమూరి కుటుంబం మధ్య ఎలాంటి శత్రుత్వం లేదుగానీ.. పోటీ మాత్రం కావల్సినంత ఉంది. అలాంటప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పడమంటే మామూలు విషయమా?? అది పవన్ కల్యాణ్ కే సాధ్యం. పవన్ మాట కూడా అక్షరాలా నిజం. ఎన్టీఆర్ అంత ఇమేజ్ తెలుగులో ఎవరు తెచ్చుకొన్నారు గనుక? ఆ దరి దాపుల్లోకి వెళ్లగలిగింది చిరంజీవి ఒక్కడే. మెగా హీరోల్లో ఎవరిని అడిగినా 'చిరంజీవిని మించిన హీరోలేడు' అనే అంటారు. కానీ పవన్ మాత్రం.. నిజాయతీగా సమాధానం చెప్పాడు. అంతేకాదు... ''నాకు నటన పెద్దగా రాదు. డాన్సులు చేయలేను. ఏదో ఇలా బండి లాగించేస్తున్నా. నా సినిమాలు హిట్టవుతున్నాయంటే నాకే నమ్మశక్యం కావవం లేదు'' అంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాంటి ఇగో లేకుండా మాట్లాడాడు. అందుకే అనేది.. వన్ అండ్ ఓన్లీ పవన్ అని. అతను సామాన్యుడిగా కనిపించే అసమాన్యుడని!! జయహో పవన్..