English | Telugu
ఓటీటీలోకి ఆస్కార్ విజేత 'ఓపెన్‌హైమర్'.. నోలన్ ఫ్యాన్స్ కి పండగే!
Updated : Mar 12, 2024
తాజాగా ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ఓపెన్‌హైమర్'(Oppenheimer) సత్తా చాటిన సంగతి తెలిసిందే. 13 కేటగిరీల్లో నామినేట్ అయిన ఈ సినిమా.. ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులు కూడా ఉన్నాయి. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ కి ఇదే మొదటి ఆస్కార్ అవార్డు కావడం విశేషం.
క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఇండియాలోనూ బాగానే అభిమానులు ఉన్నారు. పైగా ఆయనకు మొదటి ఆస్కార్ ను అందించిన సినిమా కావడంతో 'ఓపెన్‌హైమర్'ను థియేటర్లలో మిస్ అయిన వారు.. ఓటీటీలో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. జియో సినిమాలో మార్చి 21 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ చిత్రానికి అదిరిపోయే లభిస్తుంది అనడంలో సందేహం లేదు.
2020లో వచ్చిన 'టెనెట్' తర్వాత క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఓపెన్‌హైమర్'. 2023 జులైలో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఇది క్రిస్టోఫర్ డైరెక్ట్ చేసిన మొదటి బయోపిక్ కావడం విశేషం. అమెరికా శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడు 'జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
ఆస్కార్స్-2024 లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు(క్రిస్టోఫర్ నోలన్), ఉత్తమ నటుడు(కిలియన్ మర్ఫీ), ఉత్తమ సహాయ నటుడు(రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్(హొయితే వాన్ హోతేమ), ఉత్తమ ఎడిటర్(జెన్నిఫర్ లేమ్), ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్(లుడ్విగ్ గోరాన్సన్) విభాగాల్లో 'ఓపెన్‌హైమర్' సినిమా అవార్డులను గెలుచుకుంది.