English | Telugu

ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ అందించిన అరుదైన గౌరవం!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటన అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక పరిపూర్ణ నటుడిగా అవతరించాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా భాగమవడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ సినీ చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనదగిన ‘ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌’లో ఎన్టీఆర్‌కు స్థానం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌’లో కొత్త మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌లో ఎన్టీఆర్‌ పేరును కూడా జతచేశారు. ఈ ఏడాది ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. వీరిలో తారక్‌తో పాటు కె.హుయ్‌ క్వాన్‌, కెర్రీ కాండన్‌, రోసా సలాజర్‌, మార్షా స్టెఫానీ బ్లేక్‌ ఉన్నారు. ఇంతటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌తోపాటు దేశంలో ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నటనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి అవార్డు రాలేదని అభిమానులు ఎంతో నిరాశతో వున్నారు. ఈ సమయంలో ఆస్కార్‌ నటుల జాబితాలో ఎన్టీఆర్‌కు కూడా స్థానం లభించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానుల ఆనందానికి అంతులేదు.