English | Telugu

హ్యాట్రిక్‌ విజేతను అభినందించిన బాలయ్య డైరెక్టర్స్‌!

ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు, ఫలితాలు. ఎపీ ప్రజలు గత పాలకులను గద్దె దించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కూటమి విజయాన్ని అందరూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వరసగా మూడోసారి హిందూపూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై నటసింహ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్‌ సాధించారు. ఇలాంటి ఓ రేర్‌ ఫీట్‌ను సాధించిన నందమూరి బాలకృష్ణను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు.

ప్రముఖ దర్శకులు అనిల్‌ రావిపూడి, కొల్లి బాబీ.. తమ హీరో బాలయ్యను అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు సమర్పించారు. బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘భగవంత్‌ కేసరి’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 109వ సినిమాకి కొల్లి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణను ఓ కొత్త యాంగిల్‌లో చూపించబోతున్నారు బాబీ.