English | Telugu

చ‌క్రి పోగేసిన ఆస్తి ఎంత‌??

చ‌క్రి మ‌ర‌ణం చిత్ర‌సీమ‌ను ఎంత కృంగ‌దీసిందో తెలీదుగానీ, ఆ ఇంట్లో మొద‌లైన ర‌గ‌డ మాత్రం అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. క‌నీసం ప‌ద‌కొండు రోజుల కార్య‌క్ర‌మం కూడా ముగియ‌క‌ముందే చ‌క్రి భార్య శ్రావ‌ణి, ఆయ‌న కుటుంబం రెండుగా చీలిపోయి మీడియాకు ఎక్క‌డం, హెచ్ ఆర్ సీ వ‌ర‌కూ ఈ వ్య‌వ‌హారం వెల్ల‌డం చ‌క్రిని అభిమానించే వాళ్లంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. `ఏదో తొంద‌ర పాటు వ‌ల్ల‌.. హెచ్ ఆర్ సీకి వెళ్లా. మేమంతా ఒక్క‌టే` అని శ్రావ‌ణి చెబుతున్నా, లుక‌లుక‌లు ఇంత‌టితో స‌మ‌సిపోయే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. చ‌క్రి ఆస్తిలో ఎవ‌రికి ఎంత వాటా ద‌క్కాల‌న్న గొడ‌వ చ‌క్రి మ‌ర‌ణించిన రోజు నుంచే మొద‌లైందంటే... ఇంత‌కంటే షాకింగ్ విష‌యం మ‌రోటి ఉండ‌దు. ఇంత‌కీ చ‌క్రి ఆస్తి ఎంత‌? ఏం సంపాదించాడు? అనే విష‌యాలు ఆరా తీస్తే కొన్ని ఆస‌క్తికర‌మైన విష‌యాలు తెలిశాయి. దాదాపు 100 సినిమాల‌కు ప‌నిచేసిన చ‌క్రి బాగానే సంపాదించాడు. కాక‌పోతే.. త‌న బంధువులు, ఇంట్లోవాళ్లు, స్నేహితుల‌కు బాగా ఖ‌ర్చు పెట్టేవాడు. దాంతో పోగేసిన ఆస్తి త‌క్కువే. దాదాపు రూ.20 కోట్ల నిక‌ర ఆస్తి చ‌క్రికి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా చ‌క్రి బంగారం రూపంలో ఎక్కువ గా ఆస్తిని నిల్వ ఉంచాడ‌ని తెలుస్తోంది. ఆ బంగారం కోస‌మే... ఇప్పుడు ఇంట్లోవాళ్లు కొట్టుకు చ‌స్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. ఇల్లు, స్థ‌లాలూ చ‌క్రి పేరు మీదే ఉన్నాయి. చ‌ట్ట ప్ర‌కారం వాటిపై హ‌క్కు భార్య శ్రావ‌ణికే. అయితే బంగారం త‌మ‌కు ఇవ్వ‌మ‌ని కుటుంబ స‌భ్యులు గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నార్ట‌. ఈ విష‌యంలో చిత్ర రంగంలోని పెద్ద‌లూ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. `ఏమైనా ఉంటే కామ్ గా చేసుకోమ‌ని, వీధిలోకి రావ‌ద్ద‌ని` ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లూ న‌చ్చ‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది. దాంతో శ్రావ‌ణి కాస్త మెత్త‌బ‌డింది. ఇంట్లో వాళ్లూ.. `మామ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లూ లేవు` అని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. మ‌రి.. చివ‌రికి ఈ ఆస్తి గొడ‌వ ఎంత వ‌ర‌కూ వెళ్తుందో ఏమో..??