English | Telugu

ముకుంద‌ రివ్యూ

శ్రీ‌కాంత్ అడ్డాల‌ చాలామంచి ద‌ర్శ‌కుడు. నిజాయ‌తీగా ప్ర‌య‌త్నిస్తాడు. అనుకొన్న క‌థ‌ని అందంగా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేస్తాడు. కొత్త‌బంగారులోకం, సీత‌మ్మ‌వాకిట్లో... ఇలాంటి క‌థ‌లే క‌దా..? స‌మాజంలోంచే క‌థ‌లు ఎంచుకోవ‌డం, మ‌నం మాట్లాడుకొనే మామూలు మాట‌లే అవీ మాట్లాడేయ‌డం.. ట‌చ్ చేస్తుంది. పైగా కుటుంబ బంధాలూ, ప‌ల్లెల అందాలూ ఆయ‌న క‌థ‌ల్లో క‌నిపిస్తాయి. అందుకే రెండు సినిమాల‌కే మంచి మార్కులు కొట్టేసి, మ‌న‌సుల్ని ప‌ట్టేశాడు. ఇప్పుడు మ‌రో సినిమా చేశాడు ముకుంద అని! ఎంత మెగా హీరో ఎంట్రీ సినిమానే అయినా, శ్రీ‌కాంత్ అడ్డాల మార్క్ కోసం, ఆయ‌నెలా తీశాడో తెలుసుకొందామ‌నే ఆశ‌లూ అంచ‌నాల‌తో.. జ‌నాలు థియేట‌ర్ల‌లో అడుగుపెట్టారు. మ‌రింత‌కీ ముకుంద‌లో శ్రీ‌కాంత్ చూపించిన అనుబంధాలెలాంటివి?? యువ‌త‌రం మ‌నోభావాల్ని, ఆలోచ‌నల్ని ముకుంద‌తో బ‌య‌ట‌పెట్టాడా??? చూద్దాం.. రండి.

ముక్కుసూటిగా మాట్లాడే యువ‌కుడు ముకుంద (వ‌రుణ్‌తేజ్‌). అదే ఊర్లో మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌గా గ‌త పాతికేళ్ల నుంచి గెలుస్తుండే వ్య‌క్తి రావు ర‌మేష్‌. ఈసారీ ప‌ద‌వి త‌న‌కే ద‌క్కాల‌నుకొంటాడు. త‌న వ్య‌తిరేక వ‌ర్గాన్ని లేకుండా చూసుకొంటుంటాడు. ఆ ఇంటి అమ్మాయినే ముకుంద‌ స్నేహితుడు అర్జున్ ప్రేమిస్తుంటాడు. దాంతో ఛైర్మ‌న్ మ‌నుషులు అర్జున్‌ని టార్గెట్ చేస్తారు. అర్జున్‌ని అన్నివేళ‌లా ముకుంద‌ కాపాడుతుంటాడు. ఈ పోరాటంలో ఛైర్మ‌న్‌తోనే నేరుగా యుద్దానికి దిగుతాడు ముకుంద‌. అదే ఊర్లోని ఓ మంచి వ్య‌క్తి (ప్ర‌కాష్‌రాజ్‌)ని ఛైర్మ‌న్‌కి పోటీగా బ‌రిలోకి దిగుతాడు... గెలిపిస్తాడు. ఇందంతా ఎలా జ‌రిగింది?? గోపిక (పూజా హెగ్డే) పాత్ర ఏమిటి?? అస‌లు ముకుంద‌కీ, ఛైర్మ‌న్‌కి వైరం ఎక్క‌డ‌, ఎలా, ఎందుకు, ఏ రూపంలో మొద‌లైంది?? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ముకుంద చూసి తెల్సుకోవాల్సిందే.

క‌థ‌గా ఎలాంటి మ్యాజిక్కూ లేదు. ఇలాంటి క‌థ‌లు అబ్బో.... చాలా చూశాం. కానీ మార్పేంటంటే ఈసారి ఈ క‌థ‌కు డైరెక్టరు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఆయ‌న సున్నిత‌త్వం, ఆయ‌న ఈ క‌థ‌ని చూసే కోణం.. కాస్త కొత్త‌గా అనిపించాయి. మ‌రీ ముఖ్యంగా రావు ర‌మేష్ క్యారెక్ట‌రైజేష‌న్ చాలా చాలా బాగుంది. ఆ పాత్ర కోసం ఆయ‌న రాసుకొన్న డైలాగులూ... ఆక‌ట్టుకొంటాయి. ఎక్కువ‌గా సైన్స్ ప‌దాల‌ను డైలాగుల్లో వాడుకొన్నారు. ఆర్థ్ర‌త‌, సాంద్ర‌త‌, వ్యాకోచం, భూమ‌ధ్య‌రేఖ‌, స‌ముద్ర‌మ‌ట్టం.. ఇలాగ‌న్న‌మాట‌. ఈ ప‌ద్ధ‌తి బాగుంది. యువ‌త‌రం ఆలోచ‌న‌ల్ని, వాళ్ల దూకుడు స్వ‌భావాన్ని చాలా నేచుర‌ల్‌గా తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఫైట్స్‌, ఎమోష‌న్స్ అన్నీ ఉన్నాయి. కాక‌పోతే అన్నీ నేచుర‌ల్‌గా. ఈ సినిమాలోని అతి ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. హీరో, హీరోయిన్లు మాట్లాడుకోరు. చివ‌రి వ‌ర‌కూ. అదెలా సాధ్య‌మైందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ద్వితియార్థం క‌థ గాడిత‌ప్పింది. ఎల‌క్ష‌న్ ఎపిసోడ్ ఎప్పుడైతే రంగంలోకి వ‌చ్చిందో, అప్ప‌టి వ‌ర‌కూ కాస్త కొత్త‌గా క‌నిపించిన క‌థ‌... ప‌ట్టాలు త‌ప్ప‌డం మొద‌ల‌వుతుంది. ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్‌తో నే సినిమాకి ఎండ్ కార్డ్ ప‌డాల్సింది. కానీ జ‌ర‌గ‌దు. మ‌రో ఇర‌వై నిమిషాల క‌థ న‌డిపిస్తారు. ద‌ర్శ‌కుడి స్ర్కీన్‌ప్లేలో ఇదో ప్ర‌ధాన‌మైన లోపం. కాక‌పోతే హీరోయిజాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల మ‌రో స్టైల్‌లో ప్రెజెంట్ చేశాడు. హీరో అంటే చొక్కాలు చిరిగేట్టు కొట్టుకోవ‌డం, గొంతులు పోయేట్టు అర‌చుకోవ‌డం కాదు. అదే చెప్పాడు.. చూపించాడు. ఓ సీన్‌లో హీరో మాట్లాడ‌డు.. కానీ ఫైట్ చేసిన‌ట్టే ఉంటుంది. యాక్ష‌న్ సన్నివేశాల్ని కూడా ద‌ర్శ‌కుడు బాగానే తీర్చిదిద్దుకొన్నాడు.

ఈ సినిమాలో కొన్ని ఆ మాట‌కొస్తే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది.. ప్ర‌కాష్‌రాజ్ పాత్ర చిత్ర‌ణ‌. అస‌లు ఆయ‌నెవ‌రు? ఎందుకు ఆయ‌న్నే ఛైర్మ‌న్ పై పోటీకి దింపాడు అన్న‌ది క్లారిటీ లేదు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 25 సం.గా తిరుగులేని నాయ‌కుడు, పైగా ఆ ఊరికి మంచి చేసిన వ్య‌క్తి (ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు అందుకొన్న‌ట్టు ఓ స‌న్నివేశంలో చూపించారు) ఓ అనామ‌కుడి చేతిలో ఓడిపోవ‌డం లాజిక్ లేని విష‌య‌మే. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత క‌థ గాడిత‌ప్ప‌డానికి కార‌ణం... చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉన్న‌ప్పుడు అమ్మాయి ఇంట్లోవాళ్లు చూస్తారు. మ‌నోడిని త‌రుముకొంటూ వ‌స్తారు. అక్క‌డ హీరో అడ్డుకొని ఫైట్ చేస్తాడు. ముందు నుంచి చివ‌రి వ‌ర‌కూ ఇదే తంతు. హీరో, హీరోయిన్లు అస్స‌లు మాట్లాడుకోక పోవ‌డం కొత్త‌గానే ఉన్నా... మ‌రి స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఎంత వ‌ర‌కూ జీర్ణం చేసుకొంటాడ‌న్న‌ది సందేహం.

వ‌రుణ్‌తేజ్ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అత‌ని హైట్‌, ప‌ర్స‌నాలిటీ బాగున్నాయి. డైలాగ్ డిక్ష‌న్ కూడా ఓకే. కానీ అన్నింటికీ ఒకే ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన‌ట్టు అనిపించింది. తొలి సినిమా క‌దా, త‌ర్వాత‌ర్వాత స‌ర్దుకోవ‌చ్చు. అత‌ని క‌ళ్లు ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. త‌ప్ప‌కుండా వృద్దిలోకి వ‌చ్చే ల‌క్ష‌ణాలున్నాయి. పూజా చూడ్డానికి అందంగా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. అయితే ఆమె పాత్ర‌కీ అంత స్కోప్ లేదు. ప్ర‌కాష్‌రాజ్‌ది మూడు నాలుగు స‌న్నివేశాల పాత్ర మాత్ర‌మే. కానీ ఆ పాత్ర‌తో ప‌లికించిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొంటాయి. ర‌ఘుబాబు, నాజ‌ర్‌, అలీ.. త‌మ అనుభవాన్ని రంగ‌రించారు. అయితే అంద‌రికంటే ఎక్కువ మార్కులు రావు ర‌మేష్‌కి ద‌క్కుతాయి. ప్ర‌తి సారీ రావుర‌మేష్ పాత్ర‌కి అద్భుతంగానే రాసుకొంటున్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఈసారి మాత్రం 100కి 100 మార్కులు వేయాల‌న్నంత చ‌క్క‌గా న‌టించాడు. రావు గోపాల్రావు వార‌సుడు అనిపించాడు.

మిక్కీ సంగీతంలో మెరుపుల్లేవు. ప్ర‌తి పాటా ఒకేలా అనిపించింది. ఆర్‌.ఆర్ మాత్రం ఎఫెక్ట్ చూపించాడు. ఛాయాగ్ర‌హ‌ణం సూప‌ర్బ్‌. సినిమాని రిచ్‌గా తీశారు. శ్రీ‌కాంత్ అడ్డాల మ‌రోసారి త‌న శైలి ప‌నిత‌నం చూపించారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న రాసుకొన్న సంభాష‌ణ‌లు బాగున్నాయి. ఈ సినిమాని నిల‌బెట్టేవి అవే. పంచ్ కోసం మాట అని కాకుండా, ఏదో చెబుదాం అన్న తాప‌త్ర‌యం క‌నిపించింది. ద‌ర్శ‌కుడికంటే.. మాట‌ల ర‌చ‌యిత‌గానే ఆయ‌న ఎక్కువ మార్కులు సాధించారు.

రేటింగ్ 2.5/5