English | Telugu
పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
Updated : Dec 22, 2025
ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయోజనం ఎంత ఉందో, ప్రమాదం కూడా అంతే ఉందనేది వాస్తవం. ఇటీవల కొందరు సినీ ప్రముఖులు ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు. వారిలో టాలీవుడ్ హీరోలు పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. దీంతో వీరిద్దరూ విడివిడిగా ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్‌పై పిటిషన్లు వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది.
వారి అనుమతి లేకుండా ఫోటోలను, వీడియోలను వాణిజ్యపరంగా వాడుకోవడాన్ని ఢిల్లీ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. కొన్ని సోషల్ మీడియా సంస్థలకు, ఈ కామర్స్ సంస్థలకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వినియోగించడం, మార్ఫింగ్ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతోందని పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది.
సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, అవమానకరమైన పోస్టులు విచ్చలవిడిగా ఉన్నాయని నటుల తరఫు న్యాయవాది సాయి దీపక్ తన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ఫిర్యాదు అందిన వెంటనే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ కేసులో మరింత లోతైన విచారణ అవసరమని భావించిన న్యాయస్థానం, తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది.