English | Telugu

నవీన్‌ పొలిశెట్టితో నెక్స్‌ట్‌ మూవీ.. క్లారిటీ ఇచ్చిన మణిరత్నం!

1987లో కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ‘నాయగన్‌’ చిత్రాన్ని తెలుగులో ‘నాయకుడు’ పేరుతో రిలీజ్‌ చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఎంతో మంది దర్శకులకు మార్గదర్శకంగా మారింది. ఆ తరహా సినిమాలు మరిన్ని రూపొందేందుకు ‘నాయకుడు’ బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఇదే సినిమాను ‘దయావాన్‌’ పేరుతో హిందీలో వినోద్‌ ఖన్నా హీరోగా ఫిరోజ్‌ఖాన్‌ రూపొందించారు. కమల్‌హాసన్‌, మణిరత్నంలకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన ‘నాయకుడు’ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. 38 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘థగ్‌లైఫ్‌’. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూన్‌ 5న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ‘థగ్‌ లైఫ్‌’ తర్వాత మణిరత్నం తెలుగులో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 1989లో నాగార్జున హీరోగా మణిరత్నం రూపొందించిన ‘గీతాంజలి’ ఓ క్లాసిక్‌గా ఇండియన్‌ సినిమాలో నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మణిరత్నం డైరెక్ట్‌గా తెలుగు సినిమా చెయ్యలేదు. టాలీవుడ్‌లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్న నవీన్‌ పొలిశెట్టితో మణిరత్నం సినిమా చెయ్యబోతున్నారనేది తాజా వార్త. అయితే దీనికి ఎలాంటి ఆధారం లేదు. గాసిప్‌గానే ప్రచారం అవుతోంది. ‘థగ్‌లైఫ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్త గురించి ప్రస్తావించినప్పుడు ‘బయట ఏం వార్తలు వస్తున్నాయి అనేది నాకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలీదు. నేను మాత్రం ప్రస్తుతం రెండు స్క్రిప్టులపై వర్క్‌ చేస్తున్నాను. ఈ రెండింటిలో ఏది మెటీరియలైజ్‌ అవుతుంది అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను’ అని వివరించారు మణిరత్నం. నవీన్‌ పొలిశెట్టితో సినిమా ఉంటుందా లేదా అనే విషయం గురించి మాత్రం ఆయన స్పష్టం చెప్పలేదు. వాస్తవానికి నవీన్‌ పొలిశెట్టి, మణిరత్నం కాంబినేషన్‌ అనేది ఎవరూ ఊహించనిది. అలాంటి కాంబినేషన్‌ గురించి వార్త వచ్చింది అంటే ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉంది అని కొందరు అంటున్నారు. ఇప్పుడు మణిరత్నం వర్క్‌ చేస్తున్న రెండు సబ్జెక్ట్‌లలో ఒకటి నవీన్‌ పొలిశెట్టితో ఉండే అవకాశం ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏమిటి అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.