English | Telugu
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ రివ్యూ
Updated : Feb 6, 2015
రాజారామ్ (శర్వానంద్) ఒక రన్నర్. నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంటాడు. తనతోనే చదువుతోన్న నజీరాని (నిత్య) ప్రేమిస్తాడు. మతాలు వేరయినా కానీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. రాజారామ్ లక్ష్యం చేరుకోవడానికి నజీరా సపోర్ట్ గా వుంటుంది. ఈ సపోర్ట్ తో రాజారాం తను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ విడిపోతారు. ఏళ్లు గడిచిపోతాయి. అయినా కానీ ఇద్దరూ తాము ప్రేమించిన వాళ్లని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటవుతారా, లేదా? అనేది మిగతా కథ.
తెలుగు తెరపై చాన్నాళ్ల తర్వాత వచ్చిన స్వచ్ఛమైన ప్రేమకథ.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.. ప్రేమించిన వ్యక్తి నుంచి విడిపోయినా ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ చావదు.. అనే కాన్సెప్టుతో ఓ సిన్సియర్ ప్రయత్నం చేశాడు క్రాంతి మాధవ్. ఎంత స్వచ్ఛమైన కాన్సెప్టును ఎంచుకున్నాడో.. అంతే స్వచ్ఛంగా దాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. కామెడీ, సెంటిమెంట్, ట్విస్టులు అని లెక్కలేసుకోకుండా.. తను చెప్పాలనుకున్నది సిన్సియర్‌గా, పక్కదారి పట్టకుండా చెప్పాడతను. అతడికి అన్ని విభాగాలూ అంతే సిన్సియర్ గా సహకారమందించాయి. శర్వానంద్, నిత్యా మీనన్ లాంటి పర్ఫెక్ట్ జోడీని ఎంచుకోవడంలోనే క్రాంతి మాధవ్ సగం విజయం సాధించాడు. వాళ్లిద్దరం నటించడం మాని.. రాజారాం, నజ్రియా పాత్రల్లో జీవించారు. వాళ్ల నటన, కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో లవ్ స్టోరీకి సగం జీవం వచ్చింది. మిగతా సగం జీవం గోపీసుందర్ నేపథ్య సంగీతం, జ్నానశేఖర్ ఛాయాగ్రాహణం పోశాయి. అత్యుత్తమ నిర్మాణ విలువలు కూడా తోడై.. తెరమీద ఓ చక్కటి ప్రేమకావ్యం ఆవిష్కృతమైంది.
హీరో కోణంలో సాగే ప్రథమార్ధంలో అంతా పాజిటివ్ గా సాగడం వల్ల.. కథనం కాస్తంత వినోదాత్మకంగానే నడుస్తుంది. ఐతే హీరోయిన్ కోణంలో సాగే ద్వితీయార్ధంలో లవ్ స్టోరీలోని బాధాకరమైన ఎపిసోడ్ చూపిస్తాడు. ద్వితీయార్ధమంతా కూడా ఎమోషన్స్ మీదే నడుస్తుంది. కాబట్టి కాస్త భారంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ఎందులోనూ ఫీల్ మాత్రం చెడలేదు. క్లైమాక్స్ లో నేపథ్య సంగీతం, నటీనటులు అభినయం తారా స్థాయికి చేరి.. సినిమాకు తిరుగులేని ముగింపు లభించింది. శర్వా, నిత్య మాత్రమే కాదు.. మిగతా నటీనటులందరూ కూడా గొప్పగా అభినయించారు.
మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఆణిముత్యాల్ని ఏరుకున్న వారికి ఏరుకున్నంత. బహుశా ఈ మధ్య కాలంలో ఇంత డెప్త్ ఉన్న మాటలు మరే రచయితా రాసి ఉండడు. ఎంతో నిగూడార్థమున్న గొప్ప మాటలు రాశాడతను. ”ప్రేమంటే దగ్గరగా ఉండటం కాదు.. దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం”.. ఇలాంటి గొప్ప మాటలు చాలా ఉన్నాయీ సినిమాలో. కేవలం మాటల కోసమే ఈ సినిమా చూడొచ్చు. నటన ఇష్టపడేవాళ్లు.. శర్వా, నిత్యల కోసం.. సంగీత ప్రియులు గోపీసుందర్ నేపథ్య సంగీతం కోసం.. ఆహ్లాదాన్ని ఇష్టపడేవాళ్లు జ్నానశేఖర్ విజువల్స్ కోసం.. మంచి మాటల్ని ఇష్టపడేవాళ్లు సాయిమాధవ్ డైలాగ్స్ కోసం.. ఈ సినిమా చూడొచ్చు. కాకపోతే కమర్షియల్‌గా కావాల్సినవెన్నో త్యాగం చేసిన ఈ లవ్‌స్టోరీ ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌ని మాత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తుంది. దురదృష్టవశాత్తూ అదే ఈ చిత్ర ఫలితాన్ని కూడా శాశించే అవకాశముంది.