English | Telugu
రివ్యూ: పెసరట్టు... తీసికట్టు
Updated : Feb 6, 2015
సినిమా ‘పెసరట్టు’ వెండితెర పెనం మీద పడింది. కాకపోతే పిండి పులిసింది.. అల్లం, పచ్చిమిర్చి నిండుకున్నాయి. ఉప్పు మరీ ఎక్కువైంది. ఇంక పెసరట్టు ఏ మేరకు రుచిగా వుంటుందో చెప్పక్కర్లేదు అనుకుంటాను. చెప్పడం సులువు.. చేయడం కష్టం. అది ఏ రంగమైనా కావచ్చు. వంటకు వంక పెట్టినవాళ్లంతా వంట మాస్టర్లు కాలేరు. సినిమా క్రిటిక్స్ అందరూ మేకర్లూ కాలేరు. అందుకే విమర్శించేటపుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం. లేదా విమర్శించేవాళ్లు తమవి కాని మేకింగ్ షూల్లో కాళ్లు పెట్టకూడదు. మహేష్ కత్తి పదునైన విమర్శకుడు. ఇంటిపేరే కత్తి కాబట్టి ఇతరులు తీసిన సినిమాలను నరికిపారేస్తుంటారు. చానెళ్లలో, ఇంకా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల మీద సినిమాలను ఏకి పారేస్తుంటారు. అలాంటి సమీక్షకుడు సినిమా డైరక్షన్ చేపట్టారంటే కాస్త ఆసక్తి కలుగుతుంది. అందునా సినిమాకు ‘పెసరట్టు’ అని పేరు పెట్టారంటే, ఏదో వుంది అనే అనుకుంటారు. అందుకే పెసరట్టు సినిమా ప్రివ్యూ అనగానే మీడియా జనాలు ప్రసాద్ ల్యాబ్‌లో బాగానే చేరారు. చేరిన జనం అయిదు నిమిషాల్లో ఎగ్జిట్ గేటు వంక చూసారు. మరో నిమిషంలో బయటకు వచ్చారు. మరి కొంతమంది మరో అయిదు నిమిషాల్లో జంప్! ప్రివ్యూకి కాస్త ఆలస్యంగా వచ్చిన వాడిని, ముందు వచ్చినవాడు.. అయ్యిందా.. సరదా తీరిందా.. అన్నట్లు జాలి చూపు చూసారు.
సినిమా ప్రారంభం.. టైటిల్స్ అవుతూనే.. పెసరట్టు టైటిల్ సాంగ్.. కమ్ ఐటమ్సాంగ్.. పెసరట్టుని మెనూలో ఐటమ్ అంటారు కాబట్టి.. దానికీ దీనికీ ముడిపెట్టాడేమో దర్శకుడు. అది అయిన తరువాత పది పదిహేను నిమిషాలపాటు సినిమా చూస్తే, దూరదర్శన్ ప్రారంభంలో విజవల్స్ తోడు చేసుకున్న రేడియో నాటికలు గుర్తుకొచ్చాయి. వీడియోగ్రాఫర్, అసిస్టెంట్ వచ్చారు.. నిశ్చితార్థం హడావుడి.. పెళ్లి కూతురు జంప్.. ఇదీ విషయం. దీన్ని అయిదు నుంచి పది నిమిషాల పాటు తీసిన తీరు.. ఇంట్లో జనాలు, వారందరికీ మేనరిజమ్స్, నాటకానికి ఎక్కువ, సినిమాకు తక్కువ అన్నట్లు ఆ డైలాగులు, ఇప్పటిదాకా చాలు పెసరట్టు ఏ మేరకు కాలిందో, ఏ మేరకు రుచిగా వుందో తెలుసుకోవడానికి. ఒక్క ప్రారంభ నిశ్చితార్థం సీన్‌కు రాసిన డైలాగులు ఓ నాటికకు సరిపోతాయేమో? అదే పది నిమిషాల టైమ్‌ను షార్ట్ ఫిలింలు తీసేవారికి ఇస్తే, రెండు మూడు అద్భుతాలు చూపించేస్తారు. ఇదంతా కత్తి మహేష్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికో, చిన్నబుచ్చడానికో చెప్పడం లేదు. సినిమా జనాలు తరచూ ఓ మాట చెబుతుంటారు. సినిమాలను విమర్శించడం కాదు, డబ్బులిస్తాం, తీసి చూపించండి అని. కానీ నిజానికి విమర్శకుల పని అది కాదు. వంట బాగుందా లేదా అని చెప్పేవాళ్లందరికీ వంట రావాలని లేదు. కానీ ఇప్పుడు మహేష్ కత్తి ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రేపు మళ్లీ ఆయన విమర్శకుడి అవతారం ఎత్తితే టాలీవుడ్ జనాలు వెనకాల అయినా ఏమంటారు? ఈయనకు తీయడం రాదు కానీ, ఎలా తీయాలో, తీయకూడదో చెబుతాడు అని అనరా? అందరు విమర్శకులకు ఇది మైనస్‌గా బాధ పెడుతూనే వుంటుంది. విమర్శకులకు టాలీవుడ్ జనాల సవాళ్లు మరికాస్త గట్టిగా వినిపించడం ప్రారంభమవుతుంది. అందుకు మాత్రమే పనికి వస్తుంది ఈ ‘పెసరట్టు’. చూడడానికి, రంజింపచేయడానికి కాదు.