English | Telugu

అప్పుడు థియేటర్లలో.. జూలై 19 నుంచి ఓటీటీలో.. మరో సంచలనానికి సిద్ధమవుతున్న సినిమా!

ఈమధ్యకాలంలో థియేటర్‌లో రిలీజ్‌ ఓ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మార్చి 28న థియేటర్లలో రిలీజ్‌ అయి సంచలనం సృష్టించిన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఓ విభిన్నమైన క్యారెక్టర్‌ పోషించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మే 26 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ డేట్‌కి డిస్నీ సినిమాని తీసుకురాలేకపోయింది. దాని తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ‘ది గోట్‌ లైఫ్‌’ చిత్రాన్ని జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌కి తీసుకురానున్నట్టు ప్రకటించింది. మలయాళం, తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఎంతో సహజ సిద్ధమైన వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించింది. 90వ దశకంలో జీవనోపాధి కోసం కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన నజీబ్‌ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గల్ఫ్‌ వెళ్లిన తర్వాత అక్కడ ఆయన ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు. వాటి నుంచి ఆయన ఎలా అధిగమించాడు అనేది సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. నజీబ్‌ నిజజీవిత సంఘటనలను ఓ పుస్తకంగా ప్రచురించారు బెన్యమిన్‌. దాన్ని బేస్‌ చేసుకుని బ్లెసీ ఈ సినిమాను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.