English | Telugu
ఆ సెట్ కు మూడు కోట్లా..?
Updated : Feb 18, 2016
నాన్నకు ప్రేమతో సినిమాతో జోష్ మీదున్న ఎన్టీఆర్ తర్వాతి సినిమా జనతా గ్యారేజ్. ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును అనేది సబ్ టైటిల్. అక్కడ తారక్ ఏమేమి రిపేర్ చేస్తాడో తెలీదు గానీ, ఆ సెట్ ను మాత్రం కొరటాల శివ ఒక రేంజ్ లో వేయిస్తున్నాడు. పూర్తిగా రియల్ గ్యారేజ్ లా కనబడాలనేది కొరటాల ఆలోచన. సురేందర్ రెడ్డితో టీం అప్ అయి చేసిన అశోక్ లో కూడా ఎన్టీఆర్ మెకానిక్ గా చేశాడు. కానీ ఆ సినిమాలో వేసిన మెకానిక్ షెడ్ సెట్ కొన్ని సీన్లు, ఫైట్లు వరకూ మాత్రమే పరిమితమైంది.
జనతా గ్యారేజ్ సెట్లో మాత్రం చాలా కీలక సన్నివేశాలుంటాయట. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ సెట్ కు మూడు కోట్లు పెడుతున్నారని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్ ప్రకాష్ చేసిన ఈ సెట్ కోసం 20 పాత కార్లను కూడా అద్దెకు తీసుకున్నారట. సారధి స్టూడియోస్ లో వేసిన ఈ సెట్లో ఫిబ్రవరి 22 నుంచి ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత, ముంబైలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీలో, ఎన్టీఆర్ తో సమంత, నిత్యామీనన్ జత కడుతున్నారు. ఎన్టీఆర్ తో సమంతకు ఇది మూడో సినిమా కావడం విశేషం.